తెలంగాణ ప్రత్యేక దేశమా.. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

తెలంగాణ ప్రత్యేక దేశమా.. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్
  • తెలంగాణ ప్రత్యేక దేశమా.. 
  • రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరు?
  • సింగరేణి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఒక రాష్ట్రమేనా లేదా ప్రత్యేక దేశామా? రాజ్యాంగంతో పని లేకుండా తెలంగాణ స్వతంత్ర ప్రతిపత్తి దేశమా? రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరు? అని రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సింగరేణి కాలరీస్‌‌లో ఉద్యోగాలకు రూల్‌‌ ఆఫ్‌‌ రిజర్వేషన్లు కల్పించకుండా చేయడంపై దాఖలైన రిట్‌‌ పిటిషన్‌‌ను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రాజ్యాంగంలో రూల్‌‌ ఆఫ్‌‌ రిజర్వేషన్‌‌ అమలు చేయాలని రాష్ట్రాలను నిర్దేశించిన విషయాన్ని ఎందుకు విస్మరించారని న్యాయమూర్తులు జస్టిస్‌‌ ఎం.ఎస్‌‌.రామచంద్రరావు, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం ప్రశ్నించింది. చట్టాలు, రాజ్యాంగాలతో పనిలేకుండా ఏ రాష్ట్రానికైనా స్పెషల్​రూల్స్‌‌ ఉన్నాయా అని నిలదీసింది. స్థానిక ఎస్టీలకు సింగరేణి కాలరీస్‌‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సింగరేణి ఎండీగా ఉన్న ఐఏఎస్‌‌ అధికారి వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని చెప్పింది. ఐఏఎస్‌‌ స్థాయి అధికారికి రిజర్వేషన్లు, చట్టం, రాజ్యాంగం గురించి చెప్పాల్సిన అవసరం లేదని, అయినా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు ఎందుకు చేయలేదని వివరణ కోరాల్సిన దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంపై తీర్పును తర్వాత వెలువరిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.