హుస్నాబాద్ క్రీడల అడ్డాగా మారాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ క్రీడల అడ్డాగా మారాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే క్రీడలకు అడ్డాగా మారుస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్​ఆవరణలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. 

అనంతరం మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, మండలానికి క్రీడా సామగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశామన్నారు. హుస్నాబాద్​లో త్వరలోనే  కబడ్డీ అకాడమీ ఏర్పాటుతో పాటు స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్ ప్లేట్లు వాడడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందుకు రూ.5,000, మున్సిపల్ కమిషనర్​కు రూ.1,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. 

అంతకుముందు అక్కన్నపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 62 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట సీపీగా బాధ్యతలు చేపట్టిన రష్మి పెరుమాళ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి బొకే అందజేశారు. కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవోలు రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. 

ఇంటిగ్రేటెడ్​ నిర్మాణ పనులు స్పీడప్​ చేయాలి

కోహెడ: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మండలంలోని తంగళ్లపల్లి శివారులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​స్కూల్​ నిర్మాణ పనులను కలెక్టర్​హైమావతితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. క్లాస్​రూమ్స్, హాస్టల్ భవనాల నిర్మాణాలు రెండు సమాంతరంగా జరగాలని సూచించారు. 

స్కూల్​ భవనాల చుట్టూ ప్రహరీ, రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు.  లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, డీఎంహెచ్​వో ధన్​రాజ్, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎంసీ చైర్​పర్సన్​నిర్మల, వైస్​చైర్మన్​తిరుపతిరెడ్డి, సర్పంచ్​సుజాత, మెడికల్​ఆఫీసర్​నిమ్రా, నాయకులు ధర్మయ్య, సుధాకర్, బాలకిషన్, రవీందర్, నారాయణ, శ్రీకాంత్, కొమురయ్య, సత్యనారాయణ, వెంకటస్వామి, మహర్షి, శివారెడ్డి ఉన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే  స్పోర్ట్స్‌ పాలసీ

సిద్దిపేట:  క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్పోర్ట్స్‌ పాలసీని తీసుకురావడంతో పాటు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పట్ల ఆసక్తి ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసి, వారికి ట్రైనింగ్‌ ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. 

యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడల్లో అనేక అవార్డులు పొందిన వారంతా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగే సీఎం కప్‌ టోర్నీలో స్టూడెంట్లు రాణించాలని ఆకాంక్షించారు.