ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్ట్ బ్రేక్!

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్ట్ బ్రేక్!
  •  దాసోజు, కుర్ర పిటిషన్ పై విచారణ
  • ఇరువైపులా వాదనలు విన్న కోర్ట్
  • విచారణ వచ్చే నెల 8కి వాయిదా

హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణం స్వీకరించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని మండలి చైర్మన్ కు సూచించింది.  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.  ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.

గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించవద్దని ఆదేశించింది. నిన్న ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్  ప్రమాణం స్వీకరించేందుకు మండలికి రాగా చైర్మన్ అందుబాటులో లేరు. అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లారు. ఈ క్రమంలో కొంత హై డ్రామా నడిచింది. ఇంతలోనే కోర్టు ఆదేశాలు రావడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.