బీఆర్ఎస్​కు భూకేటాయింపులపై..హైకోర్టులో పిల్

బీఆర్ఎస్​కు భూకేటాయింపులపై..హైకోర్టులో పిల్

హైదరాబాద్, వెలుగు :  గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి చేసిన భూకేటాయింపులపై హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లో బీఆర్ఎస్ పార్టీకి అప్పటి ప్రభుత్వం తక్కువ ధరకే 11 ఎకరాలు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ లాయర్ ఎ.వెంకటరామిరెడ్డి పిల్ వేశారు.  దీనిపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిల్​ను ఆమోదించిన హైకోర్టు.. దీనికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది. మొదట ఈ పిల్​పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నంబర్ కేటాయించలేదు. రిజిస్ట్రీ అభ్యంతరాలపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ల  డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిల్​కు విచారణార్హత ఉందన్నారు. ‘‘కోకాపేటలో ఎకరం ధర దాదాపు రూ.వంద కోట్లు ఉంది. కానీ గత ప్రభుత్వం కేవలం రూ.34.41 కోట్లకు 11 ఎకరాలను బీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది.

 దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే ఇవ్వలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే భూకేటాయింపులు జరిగాయి. ఇందులో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.1,100 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.1,100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగ కోణంలో పిల్‌‌ను చూడాలి. దీనిపై ఏసీబీ దర్యాప్తు చేపట్టేలా డీజీపీకి ఆదేశాలివ్వాలి” అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిల్‌‌ను ఆమోదిస్తూ, నంబర్ కేటాయించాలని ఆదేశించింది. ఇదే అంశంపై ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ దాఖలు చేసిన పిల్‌‌తో దీన్ని జత చేయాలంది. ఈ పిల్​లో సీఎస్​, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ, హెచ్‌‌ఎండీఏ, ఏసీబీ డీజీపీ, బీఆర్ఎస్​తో పాటు మాజీ సీఎం కేసీఆర్, నవీన్‌‌ మిట్టల్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.