
- ..హైకోర్టుకు చెప్పిన విద్యా శాఖ కమిషనర్
- ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కోర్టు సీరియస్
హైదరాబాద్, వెలుగు : డీఎస్సీ 2008లో అర్హత సాధించిన 1,382 మంది బీఎడ్ అభ్యర్థుల నియమాక ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని, దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించామని ఆయన వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులను మిగిలిన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయకపోవడంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని అడిగింది. కోర్టు ధిక్కరణగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సివస్తుందని, ఇలా చేస్తే మీ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ ఇ.తిరుమలాదేవితో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డీఎస్సీ 2008కి సంబంధించి 1,382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామన్నారు.
కొంత గడువు కావాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్ ఉత్తర్వులు అమలుచేయకపోతే కార్యదర్శి, కమిషనర్ హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయరా? అని నిలదీసింది. అధికారులు ఎందుకు హాజరుకాలేదని, నాన్‌బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం దాకా గడువు ఇవ్వాలని న్యాయవాది అభ్యర్థించారు.
మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి హాజరై మూడు రోజుల్లో నియమాక ప్రక్రియ పూర్తి చేస్తామని సమాధానం చెప్పారు. అయితే, ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, దీనికి ఎన్నికల కోడ్ అంటూ కారణాలు చెప్పొద్దని సూచించింది. ఉత్తర్వుల అమలు నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.