
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల వివరాలు సమర్పించాలని భూదాన్ బోర్డుకు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కేసుల్లో ఉన్న నాగారం, శంషాబాద్‌లోని భూములతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాతలు ఇచ్చిన ల్యాండ్ ఎంత? ఎన్ని ఎకరాలు పంపిణీ చేశారు? మిగిలిన భూమి ఎంత? వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నంబర్ 181, 182, 194, 195ల్లో భూదాన్ భూముల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్ కే.లక్ష్మణ్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల తరఫు అడ్వకేట్లు కమిషన్ ఆఫ్ ఎంక్వరీస్ చట్టంలోని సెక్షన్ 3కి సంబంధించి సుప్రీం కోర్టు, కేరళ, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సమర్పించారు.
నాగారంలోని సర్వేనంబర్ 181, 182లో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు ఉందని, మండలంలో ఉన్న భూదాన్ వివరాలు సమర్పించినట్లు భూదాన్ బోర్డు తరఫు అడ్వకేట్ కిరణ్.. న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో ఉంచామని తెలిపారు. ప్రస్తుత కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎంక్వైరీ కమిషన్ వేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి తెలిపారు.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములపై విచారణ జరపాలని కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సర్వే నంబర్ 194, 195లో భూదాన్ భూములు లేవని ప్రభుత్వం, భూదాన్ బోర్డు చెప్పడంతో మధ్యంతర ఉత్తర్వులను సవరించాలన్న ఐఏఎస్, ఐపీఎస్ తరఫు న్యాయవాదుల అభ్యర్థనను గురువారం పరిశీలిస్తామంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
పదోన్నతిపై నిర్ణయం తీసుకోండి..
శేరిలింగంపల్లి జోన్ అర్బన్ బయో డైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ పదోన్నతిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు సూచించింది. లేకపోతే స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. వరంగల్ సర్కిల్‌లో పని చేస్తున్నప్పుడు నమోదైన ఏసీబీ కేసు విచారణ ముగిసినా.. ఈ కారణంగా పదోన్నతులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన హైకోర్టు.. 4 నెలల్లో శాఖాపరమైన విచారణ కూడా పూర్తి చేసి పదోన్నతిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీన్ని అమలు చేయకపోవడంతో అనిల్ కుమార్ మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవి దేవి బుధవారం విచారణ చేపట్టి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవంటూ చెప్పారు.