ఎమ్మెల్సీల నియామకాలపై హైకోర్టు స్టేటస్‌‌కో

ఎమ్మెల్సీల నియామకాలపై  హైకోర్టు స్టేటస్‌‌కో
  • వచ్చే నెల 8 వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • తాత్కాలికంగా ఆగిన ప్రమాణ స్వీకారం
  • కోదండరామ్​పై కేసీఆర్​ కుట్ర: టీజేఎస్​ 
  • నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్​, అమీర్‌‌ అలీఖాన్‌‌ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టేటస్‌‌కో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీలుగా బుధవారం చేయబోయే ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా ఆగింది. కాగా, గవర్నర్‌‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా గత కేసీఆర్‌‌ సర్కార్‌‌ దాసోజు శ్రవణ్‌‌ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తే గవర్నర్‌‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

గవర్నర్‌‌‌‌ నిర్ణయం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ వారిద్దరూ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. అదే సమయంలో తాము గవర్నర్​ కోటా కింద చేసే నియామక ప్రక్రియను కూడా ఆపలేమని తేల్చి చెప్పింది. దాంతో ప్రభుత్వం గవర్నర్‌‌‌‌  కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, సియాసత్‌‌‌‌ ఎడిటర్‌‌‌‌ అమిర్‌‌‌‌ అలీ ఖాన్‌‌‌‌ల పేర్లను రికమండ్‌‌‌‌ చేయడంతో ఆ పేర్లను గవర్నర్‌‌‌‌ ఆమోదించారు. దీంతో దాసోజు, కుర్ర తిరిగి హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌‌‌‌ వేశారు. ప్రధాన పిటిషన్లు విచారణలో ఉండగా నియామక ప్రక్రియ విషయంలో ముందుకు ఎలా వెళతారని అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ సుదర్శన్‌‌‌‌రెడ్డిని డివిజన్​ బెంచ్​ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని, అందుకే నియామకాలు జరిగాయని ఏజీ బదులిచ్చారు. తదుపరి విచారణ వరకు అంటే ఈ నెల 24 వరకు నియామకాలు జరగవని ఇరుపక్షాలు హామీకి వచ్చాయని, గత నెల 24న జరిగిన విచారణలో ఆ హామీ కొనసాగింపు జరగలేదన్నారు. ఈ నెల 24 వరకే ఆ హామీ అమల్లో ఉంటుందని అప్పుడే చెప్పానని అన్నారు. 

దీనిపై పిటిషనర్ల న్యాయవాదులు అభ్యంతరం చెప్పలేదన్నారు. గత హామీ ఉత్తర్వులు పొడిగించాలని కూడా కోరలేదని, అందుకే హామీ అమల్లో లేదనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే నియామకాలపై ముందుకు వెళ్లినట్లు కోర్టుకు చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వెలువడిన నోటిఫికేషన్‌‌‌‌ నిలుపుదలకు కోర్టులకు అధికారం లేదని చెప్పారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాది ఆదిత్య సోంది, న్యాయవాది మయూర్‌‌‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులోని పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్సీల నియామక ప్రక్రియను కొనసాగించబోమని గవర్నర్‌‌‌‌ ప్రకటన జారీ చేశారని చెప్పారు. అంతలోనే గవర్నర్ కోటా కింద నియామకం చేపడుతూ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసి నియామకాలు చేశారన్నారు. 

కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా నియామకాల విషయంలో గవర్నర్‌‌‌‌ ముందుకు వెళ్లడం నమ్మకాన్ని వమ్ము చేయడమేనని తెలిపారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ల డివిజన్‌‌‌‌ బెంచ్, తాము ఎమ్మెల్సీల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వడం లేదని, ఆ నియామక ప్రక్రియను నిలిపివేయడం లేదని, స్టేటస్‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌ మాత్రమే జారీ చేస్తున్నామని వెల్లడించింది. ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం, అమీర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ల నియామక ప్రక్రియపై స్టేటస్‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌  ఫిబ్రవరి 8వరకు అమల్లో ఉంటుందని ​వెల్లడించింది.

వెయిట్ చేసి వెనక్కివెళ్లి

గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఎమ్మెల్సీలు  కౌన్సిల్ లో ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం కౌన్సిల్ కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్సీలు వస్తున్నట్లు, అందుబాటులో ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ఉదయం చైర్మన్ కు సమాచారమిచ్చారు. అయితే ఎమ్మెల్సీలు కౌన్సిల్ కు వచ్చి రెండున్నర గంటలు వెయిట్ చేసినా చైర్మన్ రాలేదు. అదే రోజు సాయంత్రం అనారోగ్య కారణాల వల్ల తాను రాలేదని మీడియాకు చైర్మన్ సమాచారమిచ్చారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎమ్మెల్సీలు వెనుతిరిగారు. 

నిలదీస్తరని కేసీఆర్ వణుకుతున్నడు: టీజేఎస్ ​నేత ధర్మార్జున్​

ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంపై కేసీఆర్ కుట్ర మరో సారి బహిర్గతమైందని టీజేఎస్ జనరల్ సెక్రటరీ ధర్మార్జున్ ఆరోపించారు. ముందస్తు ప్లాన్ తోనే కోదండరాం ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేయించి కోర్టులో కేసు వేశారని మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ఉద్యమ నాయకుడు చట్టసభల్లోకి వస్తున్నరని కేసీఆర్ వణికి పోతున్నారని, గత ప్రభుత్వ అవినీతిని చట్టసభల్లో నిలదీస్తారనే భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. 2021లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి  కోదండరాంను కేసీఆర్ ఓడించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి  కుట్రలకు భయపడబోమని, ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ అంతుతేలుస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ నీచ రాజకీయాలను నిరసిస్తూ.. టీజేఎస్​ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, ప్రజా స్వామికవాదులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.