- ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నల్లగొండ జిల్లాలో మలేరియా సెంటర్‌లో పని చేసే ఫీల్డ్ వర్కర్ల పింఛను చెల్లించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను 2 వారాల్లో అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డైరెక్టర్ రవీంద్రనాయక్, ఆర్థిక, ప్లానింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావులకు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ నల్లగొండ జిల్లాకు చెందిన ఉద్యోగి ఫీల్డ్ వర్కర్ యాట సత్తిరెడ్డితో పాటు మరో 9 మంది కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ ఎస్ నంద ఇటీవల విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులిచ్చారు. ‘1984 –1987 మధ్య మమ్మల్ని ప్రభుత్వం రోజువారీ వేతనం కింద నియమించుకుంది.
2010లో మా ఉద్యోగాలను క్రమబద్దీకరించింది. పింఛన్ కోసం పాత సర్వీస్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశాం. వారు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించాం. దీనిని విచారించిన న్యాయస్థానం.. 1994 నుంచి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని.. పింఛన్ నిర్ణయించాలని అధికారులను ఆదేశించింది. 3 వారాల్లో అమలు చేయాలని 2022లో చెప్పింది. అయినా ఇప్పటికీ అమలు చేయడం లేదు’ అని ధిక్కరణ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నందా విచారించారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ ఆలోగా ఆదేశాలను అమలు చేయకుంటే ప్రతివాదులు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు.