- ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు
- విచారణ నాలుగు వారాలకు వాయిదా
- ఈ లోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసిపోతున్న తరుణంలో ఆ పదవుల్లో సర్పంచులను కొనసాగించేందుకు హైకోర్టు నిరాకరించింది. సర్పంచుల స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాల జారీకి కూడా నిరాకరించింది. నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. జనగాం జిల్లా కాంచనపల్లి, చెంగెర్ల, నిర్మల్ జిల్లా తల్వాడ, కరీంనగర్ జిల్లా నిజాయతీగూడెం సర్పంచులు విజయ, వేణుగోపాల్, అనిల్ కుమార్, మురళీధర్ దాఖలు చేసిన కేసులపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈలోగా ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్లు వేయాలని సూచించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్, పలు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచుల కొనసాగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని, ప్రత్యేకాధికారుల పాలన చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ పలువురు గ్రామ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని, ఎన్నికలు నిర్వహించకపోతే తమనే కొనసాగించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వారితోనే పాలన కొనసాగించాలని, ప్రత్యేకాధికారుల నియామకాలు చేయరాదని హైకోర్టు పేర్కొంది. కాగా నిర్దిష్ట ఐదేళ్ల కాలానికి సర్పంచుల పదవులకు ఎన్నికలు నిర్వహించారని, ఆ గడువు గురువారంతో ముగుస్తుందని తెలిసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల లాయర్లు వాదించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగంలోని 243ఇ, 243కె ఆర్టికల్స్ కు విరుద్ధమన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలోని 15(1) నిబంధన సర్పంచుల పాలన విధిగా ఉండాలని స్పష్టం చేస్తోందన్నారు. ఈ విష యాన్ని ఇదే హైకోర్టు 2022లో తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. వెంటనే జోక్యం చేసుకుని తమ క్లయింట్లను సర్పంచులుగా కొనసాగించాలన్న మధ్యంతర అ భ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.