జిల్లాకో నవోదయ స్కూల్ ఏర్పాటుపై వివరణ ఇవ్వండి .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

జిల్లాకో నవోదయ స్కూల్  ఏర్పాటుపై వివరణ ఇవ్వండి .. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున జవహర్‌‌‌‌  నవోదయ పాఠశాల ఏర్పాటుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  నేత, మాజీ ఎంపీ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌  పిల్‌‌‌‌  దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌  సుజయ్‌‌‌‌ పాల్, జస్టిస్‌‌‌‌  యారా రేణుకతో కూడిన బెంచ్‌‌‌‌  మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌  తరపు సీనియర్‌‌‌‌  న్యాయవాది జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో 9 నవోదయ పాఠశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. 

మరో 7 నవోదయ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతించినా రాష్ట్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇటీవల నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి అడ్మిషన్ల ప్రక్రియ కోసం నోటిఫికేషన్‌‌‌‌  విడుదల చేసిందన్నారు. ఇందులో తెలంగాణలో 9 పాఠశాలలనే నోటిఫై చేసిందన్నారు. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 7 విద్యాలయాలను పేర్కొనలేదని, అందువల్ల రాష్ట్రానికి 560 సీట్ల కోత పడిందన్నారు. దీంతో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది.