- హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: శాసనసభకు చెందిన 698 చదరపు గజాలు, ఉద్యానశాఖకు చెందిన 841 చదరపు గజాలు మొత్తం 1539 చదరపు గజాలను బాగ్ ఆమ్ రాయల్ మసీదుకు చెందిన భూమితో మార్పిడి ప్రతిపాదనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మసీదు విస్తరణ, పునరుద్ధరణ నిమిత్తం ప్రభుత్వం ప్రతిపాదించిన భూమార్పిడిని సవాలు చేస్తూ చిలుముల రామారావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రతిపాదిత భూమార్పిడి అమలైతే ఈ ప్రాంతంలోని వేప, రావిచెట్లను కొట్టివేయాల్సి వస్తుందన్నారు. బహిరంగ ప్రదేశాలతోపాటు పచ్చదనం కూడా కనిపించకుండా పోతుందన్నారు.. భూమార్పిడి ప్రతిపాదనకు ముందు సమగ్ర సర్వే నిర్వహించలేదన్నారు. ఉద్యానశాఖ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ తదితర అన్ని శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించేదాకా ప్రతిపాదనలను నిలిపివేయాలని కోరారు.
