బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే... స్థానిక ఎన్నికలకు బ్రేక్

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే... స్థానిక ఎన్నికలకు బ్రేక్
  • 4 వారాల్లో కౌంటర్​ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
  • ఆ తర్వాత రెండు వారాల్లో రిప్లై కౌంటర్​ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం
  • విచారణ ఆరు వారాలకు వాయిదా.. స్టే ఇవ్వడానికి కారణాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఆ జీవో ఆధారంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్‌ అమలును కూడా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని, ఆ తర్వాత రెండు వారాల్లో రిప్లై కౌంటర్​ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది.

విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల జారీకి కారణాలను సవివరంగా త్వరలో వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది. జీవో 9ని, ఎన్నికల షెడ్యూల్​ నోటిఫికేషన్‌ను సవాల్​ చేస్తూ దాఖలైన  పిటిషన్లపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ రెండో రోజు గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ సుమారు 30కిపైగా ఇంప్లీడ్‌ పిటిషన్లు కూడా దాఖలవగా వీటినీ విచారణకు అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 

అంతా శాస్త్రీయంగానే జరిగింది: ఏజీ

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అనుసరించిన విధానం పూర్తిగా చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టు, శాస్త్రీయంగా జరిగిందని వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించిందన్నారు.  కులాల వారీగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించిందని, ఇలాంటి సర్వే దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఈ పద్ధతిలో కులాల వారీ సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

సర్వే చేయాలన్న ప్రతిపాదనకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. సర్వే అనంతరం బీసీ జనాభా 57.6 శాతం ఉండటంతో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్‌ చేసిన సిఫార్సులను కేబినెట్‌ ఆమోదిస్తూ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. అనంతరం 42 శాతం రిజర్వేషన్ల బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ వారి ప్రజాప్రతినిధుల ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు.

గవర్నర్​ ఆమోదించనప్పుడు నోటిఫై అవసరం లేదు 

రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్​ చట్ట సవరణ బిల్లును ఆగస్టు 31న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఏ ఒక్క పార్టీ కూడా అభ్యంతరం చెప్పలేదని హైకోర్టు ధర్మాసనానికి ఏజీ సుదర్శన్​రెడ్డి తెలిపారు. ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపిస్తే ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదన్నారు. అంతకంటే ముందు అసెంబ్లీ  ఫోర్స్​లో లేని సమయంలో జులై 10న  ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసిందని, దానిని కూడా గవర్నర్‌కు పంపగా అదే నెల 26న గవర్నర్‌ రాష్ట్రపతికి పంపారని తెలిపారు.  దీనిని ఇంకా పెండింగ్​లోనే పెట్టారన్నారు.  సెక్షన్‌ 284–ఎ ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదన్న నిబంధనను ప్రభుత్వం సవరించిన దానికి గవర్నర్‌ నుంచి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. 

ఎంత మేరకు రిజర్వేషన్లు ఉండాలో నిర్దేశించకుండా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణితో గత ప్రభుత్వం 2018 డిసెంబర్‌ 15న  తీర్మా నం చేసిందన్నారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులను గడువులోగా గవర్నర్‌ ఆమోదించకపోతే చట్టంగానే భావించాల్సి ఉంటుందని.. తమిళనాడు ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు తీర్పు పేర్కొందని ఏజీ గుర్తు చేశారు. ఆ ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని తెలిపారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిందన్న ఏజీ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండదని వాదనలు వినిపించారు. 

ఆ రూల్​ రాజకీయ రిజర్వేషన్లకు కాదు  

బీసీ రిజర్వేషన్​బిల్లుల ఆమోదం కోసం మార్చి 30న  ప్రభుత్వం గవర్నర్​కు పంపినా ఇప్పటివరకు ఆమోదించలేదని హైకోర్టు బెంచ్​కు ఏజీ సుదర్శన్​రెడ్డి తెలిపారు.  తమిళనాడు కేసులో గవర్నర్‌కు పంపిన బిల్లులు లేదా ఆర్డినెన్సులను నిర్దిష్ట వ్యవధిలోగా ఆమోదించడమో, తిరస్కరించడమో చేయకపోతే అవి ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని తాజాగా సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిందని, తెలంగాణ విషయంలోనూ ఇది వర్తిస్తుందని ఆయన వాదనలు వినిపించారు. గవర్నర్‌ ఆమోదం చెప్పి ఉంటే ప్రభుత్వం నోటిఫై చేయాల్సివచ్చేదని, గవర్నర్‌ ఆమోదించని పక్షంలో తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అది ఆటోమేటిక్‌గా గవర్నర్‌ ఆమోదించినట్లేనన్నారు. 

ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందుకే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గవర్నర్‌ ఆమోదించలేదు కాబట్టి ప్రభుత్వం విడిగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానంగా చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన తీర్పు కేవలం విద్య, ఉపాధి రంగాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. 

ఇది రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదని పేర్కొన్నారు. చట్టాన్ని తీసుకువచ్చే అధికారం రాష్ట్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్లు జీవో 9ని మాత్రమే సవాల్‌ చేశారని, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ యథాతథంగా కొనసాగాలని, ఎలాంటి మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయొద్దని ఆయన కోరారు. 

క్యాప్​ 50% మించరాదనడం అన్యాయం

ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ అడ్వకేట్​ ప్రొఫెసర్‌ రవి వర్మ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పెంచిన బీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదన్నారు. ‘‘రాష్ట్రంలో ఎస్టీలు 10.43 శాతం, ఎస్సీలు 17.42 శాతం, బీసీలు 57.6 శాతం చొప్పున ఉంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే వాదన అన్యాయం. ఈ మూడు వర్గాల జనాభాకు 67 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక మిగిలిన 33 శాతం పదవులను కేవలం 15 శాతం ఉన్న అగ్ర కులాలకు దక్కడం అనేది కూడా అన్యాయమే. ఇప్పటి వరకు 50 శాతం పదవులను 15 శాతమున్న అగ్ర కులాల వాళ్లు అనుభవిస్తున్నరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో వచ్చే నష్టమేమీ లేదు. 

రిజర్వేషన్ల కల్పన ప్రాథమిక హక్కుల్లోకి వస్తుంది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి” పేర్కొన్నారు.   85శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 67శాతం రిజర్వేషన్లు కల్పించినా.. మరో15 శాతం జనాభాకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని.. అలాంటప్పుడు పిటిషనర్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని చెప్పడానికి వీల్లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓటు వేయడం ప్రాథమిక హక్కుల కిందికి రావని వాదించారు. ఇవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కావని, ఏ హక్కు కింద ప్రస్తుత రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారని ఆయన అడిగారు. 

తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చినప్పుడు గణాంకాలు సేకరించి పునఃపరిశీలించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, 50 శాతం పరిమితి దాటకూడదని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. అందువల్ల నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

గవర్నర్‌ ఆమోదించకుండానే.. జీవో ఎలా తెస్తారు?

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్, కె. వివేక్‌రెడ్డి ఇతరులు వాదనలు వినిపిస్తూ.. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ శాఖ కార్యదర్శి జీవో 9ని జారీ చేశారని, దీంతో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయన్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్​ చట్టానికి, సుప్రీంకోర్టు తీర్పుకు ఈ జీవో విరుద్ధమని పేర్కొన్నారు. కోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్నారు. 

రిజర్వేషన్లు 50 శాతం దాటితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకూడదని పేర్కొన్నారు. బిల్లుకు అసెంబ్లీ ఆగస్టు 31న ఆమోదించిందని, దీన్ని గవర్నర్‌కు పంపితే ఇంకా ఆమోదం రాలేదని, అయినా జీవో 9 జారీ చేశారని తెలిపారు. గవర్నర్‌ ఆమోదం లభించినప్పటికీ రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్నారు. రెండు రోజులపాటు వాదనలను విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. జీవో 9ని, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రతివాదులకు నోటీసులు

సోషల్‌ వర్కర్‌ బుట్టెంగారి మాధవ రెడ్డి, పెద్దపల్లి జిల్లా మహాముత్తారం మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రమేశ్, సిద్దిపేట జిల్లా కొండూరుకు చెందిన జల్లపల్లి మల్లవ్వ, నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన గోరటి వెంకటేష్‌ ఇతరులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లల్లో ప్రతివాదులైన బీసీ సంక్షేమ, పంచాయతీరాజ్,  సాధారణ పరిపాలన, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వం వేసే కౌంటర్లల్లోని అంశాలపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు రిప్లై కౌంటర్లను ఆ తర్వాత రెండు వారాల్లోగా దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. ప్రధాన పిటిషన్లను విచారణకు అనుమతిచ్చింది. ఈ కేసుల్లో ఇంప్లీండ్‌ అయిన సుమారు 30 పిటిషన్లను కూడా విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.