
- పొద్దున జిల్లాల్లో నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారులు
- ఎంపీటీసీలకు 103, జడ్పీటీసీలకు 16 నామినేషన్లు దాఖలు
- హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని ఎస్ఈసీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టేతో బ్రేక్ పడింది. లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం విచారణ సందర్భంగా కోర్టు నుంచి ఎలాంటి స్టే రాకపోవడం, అలాంటి సంకేతాలు లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయం జిల్లాల వారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌కు సంబంధించిన నోటీసులు జారీ చేశారు.
దీంతో గురువారం ఉదయం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో కొందరు ఆశావహులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. 31 జిల్లాల్లో ఎంపీటీసీల కోసం 103, జడ్పీటీసీ స్థానాలకు 16 మంది నామినేషన్లు వేశారు. ఎంపీటీసీల కోసం అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 17, ఆ తర్వాత నిజామాబాద్‌లో 8, రంగారెడ్డిలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. సూర్యాపేట, జనగామ, మంచిర్యాల జిల్లాల నుంచి ఎంపీటీసీల కోసం ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. మరోవైపు జడ్పీటీసీ స్థానాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అత్యధికంగా సిద్ధిపేట జిల్లాలో 7 నామినేషన్లుపడ్డాయి.
షెడ్యూల్ ప్రకారం గురు, శుక్ర, శనివారాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాల్సి ఉండగా, కోర్టు స్టే ఇస్తుందేమోనన్న అనుమానంతో గురువారం చాలామంది నామినేషన్ వేసేందుకు ముందుకురాలేదు. ఈ క్రమంలో గురువారం ఓవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే.. మధ్యాహ్నం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.
బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేయడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా, హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫలితంగా ఎన్నికల కోడ్‌కు కూడా బ్రేక్ పడింది.
ఉదయం హడావుడి.. సాయంత్రం గప్ చుప్..
బుధవారం హైకోర్టు నుంచి ఎలాంటి స్టే రాకపోవడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని స్టేట్‌ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికుముదిని జిల్లాల ఎన్నికల అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. దీంతో మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీచేసి, ఉదయం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు.
ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జిల్లా పరిషత్ ఆఫీస్‌ల్లో జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. మొదటి ఫేజ్‌లో 53 రెవెన్యూ డివిజన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకాగా.. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 15న ఉపసంహరణ గడువు ముగిశాక ఆ రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది. ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతుందని అటు అధికారులు, ఇటు ఆశావహులు భావించారు. అందుకు తగ్గట్లే పల్లెల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది.
చాలా చోట్ల రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఆశావహులు పోటీకి రెడీ అయ్యారు. నామినేషన్ దాఖలు కోసం అవసరమైన ధ్రువీకరణ పత్రాలు రెడీ చేసుకున్నారు. నేడు, రేపు మంది మార్బాలంతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. గురువారం ఉదయం అంతా ఎక్కడ చూసినా హడావుడి కనిపించింది. కొందరైతే నామినేషన్ల వేస్తూనే.. కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, వారి ఉత్సాహం ఎంతో సేపు నిల్వలేదు. కోర్టు స్టే ఇవ్వడంతో సాయంత్రం పల్లెలన్నీ గప్‌చుప్‌గా మారాయి. ఆశావహుల్లో నిరాశ అలుముకున్నది.