పార్కింగ్‌‌‌‌ ఫీజు వసూలుపై స్టే..ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఫీజు వసూలు చేయొద్దని హైకోర్టు ఆదేశం

పార్కింగ్‌‌‌‌ ఫీజు వసూలుపై స్టే..ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఫీజు వసూలు చేయొద్దని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి అటెండర్ల వాహనాలకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పార్కింగ్‌‌ ఫీజు వసూలు చేయరాదని గురువారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫీజు వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌‌ ఫీజు వసూలు చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ సికింద్రాబాద్‌‌కు చెందిన టి. నవీన్‌‌ రాజు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ బి. విజయ్‌‌సేన్‌‌ రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఫీజుతోపాటు జరిమానాలు కూడా విధిస్తున్నారని, ప్రభుత్వం జారీ చేసిన జీవో–63 ప్రకారం వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రుల్లో పార్కింగ్‌‌ ఫీజు వసూలు చేయరాదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పార్కింగ్‌‌ ఫీజు వసూలు చేయరాదని ఆదేశించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పురపాలకశాఖ, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌‌, జిల్లా కలెక్టర్‌‌, మున్సిపల్‌‌ కమిషనర్‌‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌లకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేశారు. హైదరాబాద్‌‌లోనూ పార్కింగ్‌‌ సమస్య ఉందని, జీహెచ్‌‌ఎంసీ దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. పంజాగుట్ట ప్రాంతంలో పార్కింగ్‌‌ సదుపాయం లేకపోవడంతో వాహనాలను నిమ్స్‌‌లో, కరాచీ బేకరీ ప్రాంతానికి చెందినవారు ఉస్మానియా ఆస్పత్రిలో పార్కింగ్‌‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.