మదింపు లేకుండా నోటీసులా?..జీఎస్టీ అధికారిపై చర్యలు తీసుకోండి..ఆఫీసర్లకు హైకోర్టు ఆదేశం

మదింపు లేకుండా నోటీసులా?..జీఎస్టీ అధికారిపై చర్యలు తీసుకోండి..ఆఫీసర్లకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వ్యాపారి చిరునామా మార్చుకుని రిటర్న్‌‌‌‌లు దాఖలు చేస్తున్నా..  పాత చిరునామా ఆధారంగా పన్ను చెల్లించలేదని, ఎలాంటి మదింపు లేకుండా జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌‌‌‌  నోటీసు జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన అసిస్టెంట్‌‌‌‌  కమిషనర్‌‌‌‌పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌‌‌‌ను ఆదేశించింది. చిరునామా మార్చి వ్యాపారం చేస్తుండగా తన రిజిస్ట్రేషన్‌‌‌‌ను రద్దు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ ఎం.సుబ్బయ్య అనే వ్యాపారి హైకోర్టులో పిటిషన్‌‌‌‌  దాఖలు చేశారు. 

దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌  అపరేశ్‌‌‌‌  కుమార్‌‌‌‌  సింగ్, జస్టిస్‌‌‌‌  జీఎం.మొహియుద్దీన్‌‌‌‌ల బెంచ్‌‌‌‌  గురువారం విచారణ జరిపింది. పిటిషనర్‌‌‌‌  తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నూనె, పప్పుదినుసుల వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీ అక్షయ ఆయిల్‌‌‌‌ రిఫైనర్స్‌‌‌‌లో తన క్లయింట్ భాగస్వామిగా ఉన్నారని, ప్రస్తుతం చిరునామా మారిందన్నారు. పాత అడ్రస్‌‌‌‌కు నోటీసిచ్చి సమాధానం లేదని జూన్‌‌‌‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌‌‌ను రద్దు చేశారని, దీంతోపాటు రూ.3 కోట్ల బకాయిలు రాబట్టుకోవడానికి బ్యాంకు ఖాతాను కూడా సీజ్‌‌‌‌  చేశారని తెలిపారు. 

దీనిపై వ్యక్తిగతంగా హాజరైన సోమాజిగూడ సర్కిల్‌‌‌‌ జీఎస్టీ అసిస్టెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ వివరణ ఇస్తూ సమాచారం ఆధారంగా పొరపాటు జరిగిందని, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని క్షమాపణ కోరారు. క్షమాపణ చెబితే సరిపోదని చట్టప్రకారం నిర్వహించాల్సిన బాధ్యతలను ఎలా విస్మరిస్తారని ధర్మాసనం నిలదీసింది. జీఎస్టీ మదింపు చేశాక నోటీసు జారీచేసి అప్‌‌‌‌లోడ్‌‌‌‌  చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌‌‌‌  జారీ చేసిన నోటీసును రద్దు చేసింది. ఒకవేళ పిటిషనర్‌‌‌‌  జీఎస్టీ నిబంధనలను అమలు  చేయనట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని అధికారులను బెంచ్​ ఆదేశించింది.