50 కోట్ల ఇసుకను 5 కోట్లకే ఇచ్చేశారు… హైకోర్టుకు మహిళ లెటర్

50 కోట్ల ఇసుకను 5 కోట్లకే ఇచ్చేశారు… హైకోర్టుకు మహిళ లెటర్

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఇసుక క్వారీల మైనింగ్‌లో భారీగా అక్ర‌మాలు జ‌ర‌గుతున్నాయంటూ మ‌హిళా న్యాయ‌వాది గ‌ట్టు వెంట‌క నాగ‌మ‌ణి రాసిన లేఖ‌ను తెలంగాణ హైకోర్టు పిల్‌గా ప‌రిగ‌ణిస్తూ విచార‌ణ‌కు స్వీక‌రించింది. రూ.50 కోట్ల విలువ చేసే ఇసుకను 5 కోట్ల రూపాయాల‌కే దోచిపెడుతున్నార‌న్న ఆమె ఆరోప‌ణ‌ల‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. జిల్లాలోని మంథని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ‌ నిర్వహణపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గత నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌టాపూర్ గ్రామ మానేరు ఇసుక క్వారీ మైనింగ్‌కు నిబంధ‌న‌లను కాల‌రాస్తూ అనుమ‌తి జారీ చేశార‌ని, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాల‌ని కోరుతూ మ‌హిళా న్యాయ‌వాది నాగ‌మ‌ణి హైకోర్టుకు లేఖ రాశారు. దాదాపు 50 కోట్ల విలువ చేసే ఇసుక‌ క్వారీని రూ.5 కోట్ల‌కే అప్ప‌గించార‌ని ఆమె త‌న లెట‌ర్‌లో కోర్టుకు వివ‌రించారు. ఆ క్వారీలో ఇష్టానుసారం త‌వ్వ‌కం జ‌రుపుతున్నార‌ని, దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయ‌ని, ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌ని తెలిపారు. అనేక నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కి అడ్డ‌గోలుగా ఇసుక ర‌వాణా చేస్తున్నార‌ని ఆమె త‌న పిటిష‌న్‌లో చెప్పారు. వెంక‌టాపూర్ గ్రామానికి జ‌రుగుతున్న నష్టాన్ని నివారించాల‌ని కోరారు. అలాగే మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మ‌రో 14 ఇసుక క్వారీల అక్ర‌మాల‌పైనా విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌ల‌కు ఆదేశించాల‌ని కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఆమె లేఖ‌ను ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంగా ప‌రిగ‌ణించి విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు హైకోర్టు ఇవాళ తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు మొద‌లు.. జిల్లా స్థాయి వ‌ర‌కు 9 మంది అధికారులను, శాఖలను ప్రతి వాదులుగా చేర్చి.. వారికి నోటీసులు జారీ చేసింది. గ‌డిచిన నాలుగేళ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాలని ప్రతివాదులను ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల పాటు వాయిదా వేసింది.