మీ జీతాల్లోంచి పరిహారం కట్టాల్సి వస్తది: హైకోర్టు

మీ జీతాల్లోంచి పరిహారం కట్టాల్సి వస్తది: హైకోర్టు
  • డెంగీ నివారణపై నిర్లక్ష్యం చూపొద్దని ఉన్నతాధికారులకు హైకోర్టు హెచ్చరిక
  • రేపు భూకంపం వస్తే కూడా ఇలాగే వ్యవహరిస్తారా?
  •  చర్యలు తీసుకుంటే డెంగీ కేసులు ఎందుకు పెరిగినయ్
  •  హైదరాబాద్​లో 50 ఫాగింగ్​ మెషీన్లే సరిపోతయా?
  • ఈ సమస్యపై సీఎస్, ఉన్నతాధికారులతో కమిటీ వేయండి
  • యాక్షన్​ టేకెన్​ రిపోర్ట్​తో ఒకటో తేదీన రావాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు:

డెంగీ వ్యాధిని అదుపు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, వారు చెప్తున్న లెక్కలు, తీసుకుంటున్న చర్యలకు ఏమాత్రం పొంతన లేదని హైకోర్టు మండిపడింది. నిర్లక్ష్యం వల్ల జనం చనిపోతే క్రిమినల్‌‌ ప్రొసీడింగ్స్‌‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. నిర్లక్ష్యంతో జనాలు  చనిపోతే వాళ్ల ఫ్యామిలీలకు పరిహారం ఇచ్చేలా ఆదేశాలిస్తామని, ఆ డబ్బూ సంబంధిత అధికారుల జీతాల నుంచి కట్టాల్సిందిగా ఆదేశిస్తామని హెచ్చరించింది. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలంటే ఏం చేయగలరని ప్రశ్నించింది. డెంగీ, విషజ్వరాల నివారణపై సీఎస్‌‌ అధ్యక్షతన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల ఫలితాలను ప్రతి శుక్రవారం హైకోర్టుకు నివేదించాలని సూచించింది. విచారణను వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసింది.

సీఎస్, ఉన్నతాధికారులు హాజరు

జనం డెంగీతో బాధపడుతున్నారని, వారికి వైద్యం అందించేలా సర్కారును ఆదేశించాలంటూ డాక్టర్‌‌ కరుణ, లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ వేసిన పిల్స్​పై చీఫ్​ జస్టిస్​ ఆర్ఎస్​ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్​ అభిషేక్​రెడ్డిలతో కూడి డివిజన్​ బెంచ్​ గురువారం విచారణ కొనసాగించింది. బెంచ్​ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్​ఎస్​కే జోషి, మున్సిపల్‌‌/మెడికల్ అండ్‌‌ హెల్త్‌‌ ముఖ్య కార్యదర్శులు అరవింద్‌‌కుమార్, శాంతికుమారి, మెడికల్‌‌ డైరెక్టర్‌‌ శ్రీనివాస్‌‌రావు, జీహెచ్ఎంసీ కమిషనర్‌‌ లోకేశ్​ కుమార్‌‌ కోర్టుకు హాజరయ్యారు. బెంచ్​ లేవనెత్తిన పలు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు.

నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి..

ఎంతో నమ్మకంతో ఐఏఎస్‌‌లకు కీలక బాధ్యతలు ఇస్తారని, క్లిష్ట సమయాల్లో సత్తా చూపి జనామోదం పొందాలని అధికారులకు డివిజన్​ బెంచ్​ హితవు చెప్పింది. ‘‘ఐఏఎస్‌‌ల శిక్షణకు అయ్యే ఖర్చు జనం సొమ్మే, ఆ జనం రోగాల పాలవుతుంటే మీ నిర్లక్ష్యం అనకపోతే ఇంకేమనాలి. మురికికాసారంగా మారిన మూసీ నది దగ్గరకు వెళ్లి చూస్తే వాస్తవం తెలుస్తుంది. అధికారులు తగిన చర్యలు చేపట్టక జనం డెంగీ, విష జ్వరాల బారినపడితే అది వారి బాధ్యతే. బాధల్లో ఉన్న జనం ఏం చేయాలో తెలియక న్యాయస్థానాలకు వస్తారు. అప్పుడు కూడా కోర్టులు ప్రజల పక్షాన ఉండకపోతే వారి నమ్మకం ఏం కావాలి..” అని ప్రశ్నించింది. డెంగీ, విష జ్వరాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలక్షన్‌‌ కోడ్‌‌ వల్ల మూడు మాసాల యాక్షన్‌‌ ప్లాన్‌‌ను సెప్టెంబర్‌‌ మొదలయ్యాక ప్రారంభించామని సీఎస్​జోషి వివరణ ఇచ్చారు. దీనిపై బెంచ్​ అసంతృప్తి వ్యక్తం చేసింది.

నిర్లిప్తత కనిపిస్తోంది

బుధవారం ఏజీ చెప్పిన లెక్కలకు ఇప్పుడు చెప్తున్న లెక్కలకు తేడాలున్నాయని బెంచ్​ ప్రశ్నించగా.. లెక్కలు కట్టడంలో తేడాలున్నాయని, గత నెలలో 4,847 డెంగీ కేసులుంటే, ఈ నెలలో 2,703కు తగ్గాయని సీఎస్​ జోషి జవాబిచ్చారు. అంటే ఈ విషయంలోనూ నిర్లిప్తత స్పష్టంగా కనబడుతోందని, జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టకపోతే ఎలాగని బెంచ్​ ప్రశ్నించింది. శ్రీలంక డెంగీ, మలేరియా నివారణ కోసం యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకుని ప్రపంచంలోనే రెండో ప్లేస్​లో నిలిచిందని.. హైదరాబాద్‌‌ లో మీరెందుకు చేయలేకపోతున్నారని నిలదీసింది. దోమల బ్రీడింగ్‌‌ సెంటర్స్‌‌ 400 ఉంటే వాటిని 225కు తగ్గించామని జీహెచ్ఎంసీ కమిషనర్​ చెప్పడాన్ని బెంచ్​ తప్పుపట్టింది. వానలు పడ్డాక చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంటదని, చలికాలంలోనూ దోమల సమస్య కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాలని పేర్కొంది. మూసీయే అత్యంత పెద్ద దోమల బ్రీడింగ్‌‌ కేంద్రమని స్పష్టం చేసింది. విష జ్వరాల నివారణ, చర్యలపై కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

ముందు జాగ్రత్తలేవీ?

అన్ని చర్యలూ తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు పెరిగాయని డివిజన్​ బెంచ్​ ప్రశ్నించింది. ‘‘దోమల నివారణకు ఫాగింగ్‌‌ మెషిన్లు పెంచలేరా? జీహెచ్ఎంసీలో 50 ఫాగింగ్‌‌ మిషన్ల ఉంటే ఏం చాలుతాయి. సెప్టెంబర్‌‌ మధ్యలో విష జ్వరాల నివారణకు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రూపొందించడమేంటి? వర్షాలు పడ్డాక యాక్షన్‌‌ ప్లాన్‌‌  వల్ల లాభం ఉంటుందా? వర్షాలు పడకముందే ప్లాన్‌‌ ఉండాలి కదా?’’ అని నిలదీసింది. ఎలక్షన్ల కోడ్‌‌ వల్ల చేయలేకపోయామన్న మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రజల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని రాజ్యాంగం ప్రభుత్వాలను నిర్దేశిస్తోంది. అలాంటిది ఎలక్షన్‌‌ కోడ్‌‌ ఎలా అడ్డం అవుతుంది. ఎన్నికలుండగా జంట నగరాల్లో భూకంపం వస్తే కూడా కోడ్‌‌ ఉందని ఊరుకుంటారా? ఏమీ చేయరా..?” అని నిలదీసింది.

Telangana High Court warns authorities not to neglect dengue prevention