- మొత్తం రూ.9.61 కోట్లు కాగా.. మిగతా డబ్బులకు ప్రాసెస్ కంప్లీట్
- యాదాద్రి జిల్లాలో 2023-25లో 655 పనులు మంజూరు
- వాటిలో 309 పూర్తి
- 2025-26కు సంబంధించి ఎస్డీఎఫ్ మంజూరు
యాదాద్రి, వెలుగు: ఎస్డీఎఫ్కింద పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా టోకెన్ నంబర్లు, బిల్లింగ్వివరాలను ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని బిల్లులు రిలీజ్ చేయగా, మరికొన్నింటిని త్వరలోనే చేయనుంది.
ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కింద ప్రతీ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో నియోజవర్గానికి ప్రతీ ఫైనాన్షియల్ ఇయర్లో రూ.5 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. యాదాద్రి జిల్లాలో పూర్తిస్థాయిలో ఉన్న ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు రూ.5 కోట్ల చొప్పున, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు చెందిన కొన్ని మండలాలే ఉండటంతో ప్రాధాన్యతా క్రమంలో నిధులు మంజూరు చేసింది. ఇలా జిల్లాలోని 17 మండలాలకు 2023–-24, 2024–-25 ఫైనాన్స్ఇయర్స్లో పెండింగ్ పనులతోపాటు కొత్తగా కమ్యూనిటీ హాల్స్, వాటర్‌వర్క్స్‌తో కలిపి ఈ 5 నియోజకవర్గాల్లో 655 పనులు మంజూరయ్యాయి.
2025-26 ఎస్డీఎఫ్ మంజూరు
తాజాగా 2025-–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్డీఎఫ్ను సర్కారు మంజూరు చేసింది. ఆలేరు, భువనగిరికి రూ.5 కోట్ల చొప్పున, మిగతా 3 నియోజకవర్గాలకు ప్రాధాన్యతాక్రమంలో మంజూరు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనులను గుర్తించిన తర్వాత వాటి విలువను బట్టి టెండర్లు వేయడమా, నామినేటెడ్ పద్ధతిలో కేటాయించడమా అనేదినిర్ణయించనున్నారు.
గత సర్కారు బిల్లులు పెండింగ్‌లోనే..
బీఆర్ఎస్హయాంలో కేటాయించిన ఎస్డీఎఫ్పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సర్కారు హడావుడిగా ఎస్డీఎఫ్కింద యాదాద్రి జిల్లాకు రూ.108.50 కోట్లతో 2,430 పనులు కేటాయించింది. భువనగిరికి అప్పటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.45 కోట్ల పనులు సాధించారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిని మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్డీఎఫ్నుంచే ఈ గ్రామానికి రూ.58 కోట్లు మంజూరు చేశారు. నకిరేకల్మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేటలోని శివాలయం కోసం రూ.2.50 కోట్లు కేటాయించారు.
మిగతా అప్పటి ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని పనులను గుర్తించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల ముందు 2023–24లో ఎస్డీఎఫ్ కింద మంజూరైన పనులు, వాటి స్టేటస్‌పై ఫైనాన్స్డిపార్ట్మెంట్ఆరా తీసింది. వీటిలో ప్రారంభమైన పనులు ఎన్ని, కానివి ఎన్ని అన్న వివరాలపై ఇక్కడి అధికారులు రిపోర్ట్ పంపించారు. అనంతరం వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
రూ.5 లక్షలు దాటితే టెండర్ పిలవాలి
నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన పనులకు టెండర్ పిలవాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువ అయితే ఎమ్మెల్యేలు నామినేటెడ్ పద్ధతిలో కేటాయిస్తారు. ఎమ్మెల్యేలు చేసిన వర్క్స్ ప్రపోజల్స్‌లో కొన్ని మినహా మిగిలినవన్నీ రూ.5 లక్షలలోపే ఉన్నాయి. జిల్లాకు మంజూకరైన పనుల్లో ఇప్పటికే 309 పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.9.61 కోట్ల బిల్లులను ఆఫీసర్లు రూపొందించారు. వీటిలో ఇప్పటివరకు రూ.4.86 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ ఉన్న మరో రూ.4.75 కోట్లు త్వరలోనే రిలీజ్ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
