వాదనలు, వ్యాక్సినేషన్లు కాదు.. కుక్కల దాడులు అరికట్టండి

వాదనలు, వ్యాక్సినేషన్లు కాదు.. కుక్కల దాడులు అరికట్టండి
  • అందుకు ఏం చర్యలు  చేపట్టారు: హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వం,  జీహెచ్​ఎంసీకి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కలు ఇంట్లోకి చొరబడి 80 ఏండ్ల వృద్ధురాలిని అవయవాలు బటయపడేంతగా కరిచిన దారుణ ఘటన గుండెల్ని పిండేసిందని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. వీధుల్లో కుక్కలు వీరంగం ఆడుతున్నాయి, వెంటపడి మరీ దాడులు చేస్తున్నాయి, పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి.. ఈ సమస్యకు పరిష్కారం కావాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలు ముఖ్యం కానేకాదని, సమస్య కొలిక్కి రావడమే ముఖ్యమని చెప్పింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌‌ కూడా ప్రధానం కాదని, కుక్కల దాడుల నియంత్రణ అవసరమని పేర్కొంది. ఇందుకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. సమస్య తీవ్రతను అందరూ పరిగణనలోకి తీసుకుని కుక్కల దాడుల నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలంది. ఇందుకు ప్రభుత్వ అధికారులు వాటిని స్వీకరించాలంది. వీధి కక్కుల దాడుల ఘటనలపై వచ్చిన వార్తలను, అప్పటికే దాఖలైన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రీనివాసరావులతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారించింది. మహిళను పీక్కుతిన్న కుక్కలు, చిన్నారులపై కుక్కల దాడిపై పత్రికల్లో వచ్చిన వార్తలను లాయర్లు హైకోర్టుకు చూపించారు. 

హెల్ప్​లైన్​ నంబర్, యాప్ పెట్టండి

‘‘ప్రజల కోసం హెల్ప్‌‌లైన నంబర్‌‌ ఏర్పాటు చేయాలి. యాప్‌‌ కూడా ఏర్పాటు చేయాలి. వీధుల్లో కుక్కల దాడుల నివారణ చర్యలు తీసుకోవాలి. కుక్కలకు స్టెరిలైజేషన్‌‌ చేయాలి. ఆ కుక్కలను అక్కడే వదిలిపెట్టాలి. 24 గంటలు అందుబాటులో ఉండేలా మొబైల్‌‌ వాహనాలు ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జంతు సంక్షేమ సంస్థలను సంప్రదించి దాడుల నియంత్రణకు సూచనలు తీసుకోవాలి. యానిమల్‌‌ బర్త్‌‌ కంట్రోల్‌‌ (ఏబీసీ) నిబంధనల ప్రకారం జీహెచ్‌‌ఎంసీ, స్థానిక సంస్థలు తగినన్ని షెల్టర్లు, పశు వైద్యశాలలు, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ కేంద్రాలు నెలకొల్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సినేషన్‌‌ చేయించాలి. వ్యాక్సినేషన్‌‌ నిర్వహించేందుకు జంతు సంక్షేమ సంస్థలు ముందుకొస్తే ఆ ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలి. ఏబీసీ కమిటీ నెలకోసారి సమావేశం కావాలి. హైదరాబాద్‌‌ సిటీ దూరంగా వీధి కుక్కలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి” అని ప్రభుత్వానికి, జీహెచ్‌‌ఎంసీలకు ఆదేశించింది.  

ఏబీసీ రూల్స్ మేరకు జీవో జారీ చేశాం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌‌రెడ్డి వాదిస్తూ ఏబీసీ, యాంటీ రేబీస్‌‌ ప్రోగ్రామ్‌‌  సమర్థవంతంగా అమలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. జీహెచ్‌‌ఎంసీ హెల్ప్‌‌లైన్ నంబర్‌‌ను నిర్వహిస్తోందన్నారు. కాగా, గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశాల అమలుపై జీహెచ్‌‌ఎంసీ నివేదిక అందజేసింది. పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్‌‌ చేసుకోవాలని యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. కుక్కలకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారం కోసం యాప్, ఆన్‌‌లైన్‌‌ లింక్‌‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏబీసీ నిబంధనల మేరకు జులై 16న జీవో నంబర్​315 జారీ చేసినట్లు చెప్పారు. కాగా, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి వాటికి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించాలని న్యాయవాది వేణుమాధవ్‌‌ కోరారు. జీహెచ్‌‌ఎంసీ నివేదికను పరిశీలించిన సీజే పలు సూచనలు చేశారు. జంతు సంక్షేమ బోర్డు తరఫున న్యాయవాదిగా డీఎస్‌‌జీ గాడి ప్రవీణ్‌‌కుమార్‌‌ను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణ వచ్చే నెల 2కి వాయిదా పడింది.