
వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి
కాంగ్రెస్, టీఆర్ఎస్ బొమ్మా బొరుసులాంటివి
వీరికి చెక్ పెట్టేది మోడీ ప్రభుత్వమే
రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మేళ్లచెరువు, హుజూర్నగర్, వెలుగు: తెలంగాణ తల్లి కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల చేతిలో బందీగా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, చింతలపాలెం, కోదాడ, మఠంపల్లి రోడ్ షోలలో పాల్గొని బీజేపీ అభ్యర్థి కోట రామారావు తరఫున ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, అవినీతి లేని పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిచినా వాళ్లని టీఆర్ఎస్ డబ్బులతో కొనేస్తుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణను ఓపెన్ జైలుగా మార్చారు. ఆయనకు ఉద్యోగులన్నా, కార్మికులన్నా గిట్టదు. ప్రశ్నిస్తే జైలులో పెడుతున్నడు. ఇదేమన్న నియంత పాలనా, రాచరిక పాలనా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయినయ్.
తెలంగాణ వద్దనుకున్నవారికి మాత్రం మంత్రి పదవులు వచ్చాయని ఎద్దేవా చేశారు. మోదీ ప్రవేశ పెట్టిన పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇచ్చే బియ్యం కొనుగోలుకు ప్రతి కిలోకూ రూ. 25 కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో రోడ్లు, తాగునీటి కోసం కేంద్రం నిధులిస్తున్నా ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం బయటకు చెప్పడం లేదన్నారు. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇక్కడ సరిగా అమలవ్వట్లేదని మండిపడ్డారు. లంబాడీలకు ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వకుండా దానిని ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి అడ్డుపడ్డారని అన్నారు. ఇన్ని తప్పులు చేస్తున్న టీఆర్ఎస్ కు ఎందుకు ఓటెయ్యాలో ప్రశ్నించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, అది మునిగిపోయే నావ అని అన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే అస్త్ర సన్యాసం చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడన్నారు. సీఎం అభ్యర్థినని చెప్పుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోయారన్నారు.
అధికవాటా కేంద్రానిదే…
రాష్ట్రంలోని అన్ని పథకాలలో కేంద్ర భాగస్వామ్యం ఉందని బీజేపీ అభ్యర్థి కోట రామారావు అన్నారు. హామీలు విస్మరించిన కేసీఆర్‌కు ఓటేస్తే ఉపయోగం ఉండదన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే కేంద్ర నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.