- భూముల రక్షణకు పటిష్ట చర్యలు: మంత్రి పొంగులేటి
- లీజు అగ్రిమెంట్ పునరుద్ధరణపై సంస్థలకు లేఖలు
హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కానివ్వబోమని, భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియెట్లో అధికారులతో హౌసింగ్ బోర్డు భూములపై మంత్రి రివ్యూ చేపట్టారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు తదితర అంశాలపై చర్చించారు.
ఒకవైపు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇచ్చిందని అధికారులు మంత్రికి తెలిపారు. ఇందులో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, స్కూల్స్, టెంపుల్స్ ఉన్నాయని, ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
లీజు అగ్రిమెంట్ పునరుద్ధరణ చేసుకోని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరఫున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ఏటా 10శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని, అయితే ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి హౌసింగ్ బోర్డుకు కోట్లి రూపాయిలు రావాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు.
ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్నవారు ఆ షాపులను కొనుగోలు చేయడానికి ముందుకొస్తే మార్కెట్ ధర ప్రకారం విక్రయించడానికి ప్రణాళికలను రెడీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. షాపు నిర్వహణకు అనువుగా లేకపోతే ఆ స్థలాన్ని వేలంలో విక్రయించాలని మంత్రి సూచించారు. కోర్టు కేసులలో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందేలా కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేలా అడ్వకేట్‌ను నియమించుకోవాలని సూచించారు.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించండి
గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోనివారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని, పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించాలని సూచించారు.
మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గజాల లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కనే ఉన్న వంద గజాలలోపు స్థలాన్ని అడుగుతున్నవారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక తయారుచేయాలని అధికారులకు సూచించారు.
