న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఐ అండ్ పీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హర్ష భార్గవిని తుగ్లక్ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసం వద్ద అక్కడి సిబ్బంది అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఆమెను సీఎం ఇంట్లోకి అనుమతించేది లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సిబ్బంది తేల్చిచెప్పారు. కానీ తాను ఐ అండ్ పీఆర్ ఆఫీసర్‌నని, డ్యూటీలో భాగంగా వచ్చిన తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఈలోగా స్థానిక
పోలీసులకు సీఎం సెక్యూరిటీ ఫోన్ చేయడంతో.. హర్ష భార్గవిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న మీడియా సిబ్బంది ఇదంతా కెమెరాల్లో రికార్డు చేయడం, ఆమె ఆఫీసర్ అని తేలడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. హర్ష భార్గవిని సీఎం నివాసంలోకి అనుమతించకపోవడానికి కారణాలు తెలియలేదు. కాగా, ఈ ఘటనపై ఆమె ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం.
