
ఇంటర్ విద్యార్థులకు బోర్డు కీలక అప్డేడ్ ఇచ్చింది. 2023 -24 విద్యాసంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. 2023 జూన్ 1 సోమవారం నుంచి జూనియర్ కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. మొత్తంగా 227 రోజుల పాటు తరగతులు నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది ఇంటర్ బోర్డు. ఇక ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు అమల్లో ఉన్నాయి.
జూన్ 12వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. త్వరలో ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. ఫస్ట్ ఈయర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, సెంకడ్ ఈయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
వాస్తవానికి జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అయితే జూన్ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు, ఆ తర్వాత వారం రోజుల పాటు మరికొన్ని పోటీ పరీక్షలు ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మార్చారు.