ఇంటర్ ప్రాక్టికల్స్ గవర్నమెంట్ కాలేజీల్లోనే!

ఇంటర్ ప్రాక్టికల్స్   గవర్నమెంట్ కాలేజీల్లోనే!
  • సర్కారు సెక్టార్ కాలేజీలను సెంటర్ల నుంచి మినహాయింపు
  • సీసీ కెమెరాలున్న ప్రైవేటు కాలేజీల్లోనే కేంద్రాలు
  • ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పరీక్షల నిర్వహణకు చర్యలు 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్​ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు ప్రారంభించింది. గవర్నమెంట్ కాలేజీల్లోనే ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రణాళికలు రెడీ చేసింది. సర్కారు సెక్టార్ కాలేజీలను ప్రాక్టికల్ సెంటర్లను మినహాయించాలని డిసైడ్ అయింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్​ను రెడీ చేసింది. పారదర్శకతతో పాటు పిల్లల్లో పరీక్షల పట్ల భయాన్ని పొగొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రతిఏటా సుమారు 4.20 లక్షలకు పైగా విద్యార్థులు అటెండ్ అవుతుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది.

 అయితే, ఈ పరీక్షల కోసం గతేడాది 2వేలకు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 20 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో సగం వరకూ ప్రైవేటు కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన సగం సెంటర్లు సర్కారు, సర్కారు సెక్టార్ కాలేజీల్లో ఉంటాయి. అయితే, ఈ ఏడాది పరీక్షా కేంద్రాల ఏర్పాటులో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. కేవలం గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రమే  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. 

సర్కారు సెక్టార్ కాలేజీలైన గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు తదితర వాటిని పరీక్షా కేంద్రాల నుంచి మినహాయించాలని నిర్ణయించింది. వాటిల్లోని విద్యార్థులంతా దగ్గరలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంది. కాగా, గతేడాది ప్రాక్టికల్ పరికరాల కోసం ప్రతి కాలేజీకి రూ.25వేలను ఇంటర్ బోర్డు అందించింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో మరిన్ని నిధులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ప్రాక్టికల్స్ ఎక్విప్​మెంట్ మరింత కొనుగోలుతో కాలేజీల్లో ల్యాబ్​ బలోపేతం కానున్నాయి. మరోపక్క ఒక కాలేజీలో చదివిన విద్యార్థి మరో కాలేజీలో ప్రాక్టికల్​లో పాల్గొంటే.. పరీక్షల పట్ల కొంత భయం కూడా పోయే అవకాశం ఉంది. 

ప్రైవేటు కాలేజీల్లో సెంటర్లపై ఫోకస్ 

మరోపక్క ప్రైవేటు కాలేజీల్లో సెంటర్ల ఏర్పాటు విషయంలోనూ కఠినంగా ఉండాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది. సీసీ కెమెరాలతో పాటు ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలకు మాత్రమే  ప్రాక్టికల్ సెంటర్లకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది 2008 కాలేజీల్లో సెంటర్లు ఉండగా, వాటిలో 980కి పైగా సెంటర్లు ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. ప్రాక్టికల్ ల్యాబుల్లో సీసీ కెమెరాలు లేని వాటిని సెంటర్ల జాబితా నుంచి తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా విద్యార్థులనూ సర్కారు కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది.