కాంగ్రెస్‌‌లో చేరిన చెరుకు సుధాకర్

కాంగ్రెస్‌‌లో చేరిన చెరుకు సుధాకర్

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని..ప్రలోభాలు పెట్టి పార్టీలోకి చేర్చుకొంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, రాష్ట్ర ఏర్పాటును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవమానించారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలపై 2014లో ఆర్డినెన్స్ ను ఆనాడు బీజేపీ వ్యతిరేకించిందన్నారు. కానీ.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మండలాలను కలిపారన్నారు.

భద్రాచలం మునగడానికి ఇదే కారణమని రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీలు, ప్రాజెక్టులు, ఎన్నో పథకాలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించి నిధులు ఇవ్వకపోవడం సబబు కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కంటే ముందునుంచే చెరుకు సుధాకర్ క్రియశీలకంగా పని చేశారన్నారు. కాంగ్రెస్ లో ఆయన చేరడమే కాకుండా.. తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేస్తున్నారని వెల్లడించారు. ఆయన చేరిక ఉద్యమకారులకు స్పూర్తినిస్తుందన్నారు.