టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దేశవాళీ డొమెస్టిక్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారు. విశేషం ఏంటంటే పంత్, కోహ్లీ ఒకే జట్టులో కనిపించనున్నారు. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఢిల్లీ తరపున ఆడతారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం (డిసెంబర్ 11) కన్ఫర్మ్ చేసింది. ఢిల్లీ ప్రాబబుల్స్ లో వీరిద్దరినీ ఎంపిక చేసి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. 15 ఏళ్ళ తర్వాత కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడడం ఇదే తొలిసారి అవుతుంది. మరోవైపు 2019 తర్వాత పంత్ ఈ టోర్నీలో కనిపించనున్నాడు.
"రాబోయే విజయ్ హజారే ట్రోఫీ (దేశీయ సీజన్ 2025–26) కోసం ఢిల్లీ సీనియర్ మెన్స్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను సెలెక్టర్లు ఖరారు చేశారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ విజయ్ హజారే ట్రోఫీ కోసం జట్టులో చేరనున్నారు". అని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నట్టు సమాచారం. పంత్ మాత్రం టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. జనవరిలో న్యూజిలాండ్ తో టీమిండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది.
ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో 651 పరుగులు చేశాడు. కోహ్లీ ఖాతాలో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ చివరిసారిగా 2010 ఫిబ్రవరిలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరుఫున ఆడాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత దిగ్గజ క్రికెటర్ కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. ఫిట్ నెస్, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని కోహ్లీని బీసీసీఐ కోరింది. బీసీసీఐ సూచన మేరకు రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై తరుఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఢిల్లీ మ్యాచులకు భారీగా క్రేజ్ ఏర్పడనుంది.
DDCA has announced the list of probables for the Vijay Hazare Trophy, which includes Virat Kohli and Rishabh Pant.#ViratKohli #RishabhPant pic.twitter.com/jXLrehzefi
— CricTracker (@Cricketracker) December 11, 2025

