V6 News

ఒక్కో శాఖలో ఒక్కో తీరు!..ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో భారీ తేడాలు

ఒక్కో శాఖలో ఒక్కో తీరు!..ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో భారీ తేడాలు
  • సంక్షేమ శాఖ తరఫున నియామకాలు
  • ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో ఎస్జీటీ, పీజీటీ టీచర్లకు 
  • 18వేల నుంచి 23వేలు
  • బీసీ, మైనారిటీ గురుకులాల్లో రూ.24 వేల నుంచి రూ.37 వేలు
  • రిటైర్డ్ ఎంప్లాయీస్​కు అడ్డాగా మైనారిటీ గురుకులాలు

హైదరాబాద్, వెలుగు: సంక్షేమ శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో భారీ తేడాలు కన్పిస్తునాయి. ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా జీతాలిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఎస్జీటీ, పీజీటీ టీచర్లు, జూనియర్​ లెక్చరర్లకు నెలకు రూ.18 వేల నుంచి రూ.23 వేల వరకు అందిస్తున్నారు. బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఇవే బాధ్యతలు నిర్వహస్తున్న టీచర్లకు రూ.24 వేల నుంచి రూ.37 వేల వరకు అందుతున్నాయి.

 ప్రభుత్వ విద్యాబోధన అంతా ఒక్కటే, చేసే పని ఒక్కటే అయినా జీతాల్లో ఇంత తేడా ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మైనారిటీ గురుకులాలు రిటైర్డ్ ఎంప్లాయీస్​కు అడ్డాగా మారాయి. అకడమిక్ కో ఆర్డినేటర్లు, విజిలెన్స్ టీమ్​ల పేరిట 50 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకున్నారు. మిగిలిన గురుకులాల్లో సీనియర్ స్టాఫ్​కే ఈ బాధ్యతలు అప్పగించారు. ఇదీగాక ఇతర గురుకులాల్లో కిచెన్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్​కు అప్పగిస్తే ఈ గురుకులాల్లో మాత్రం ఒక్కో స్కూల్​కు ఐదుగురు స్టాఫ్ చొప్పున నియమించి వీరికి నెల, నెలా జీతాలు చెల్లిస్తున్నారు.

చెప్పే చదువు.. చేసేపని ఒక్కటే.. జీతాలే వేరు!

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు అన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 1,020 ఏర్పాటు చేసింది. సూల్స్​లో అయితే ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు, కాలేజీల్లో అయితే ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఈయర్ క్లాస్​లు తీసుకుంటారు. 5 నుంచి 7వ తరగతి వరకు బోధించే టీచర్లను ఎస్జీటీ, 8 నుంచి పదో తరగతి వరకు బోధించే టీచర్లను పీజీటీ, ఇంటర్​ విద్యార్థులకు క్లాసులు చెప్పేవాళ్లను జూనియర్ లెక్చరర్లుగా పిలుస్తారు. పర్మినెంట్ టీచర్లు లేకుండా ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టుల్లో వెయ్యి మందికి పైగా నిరుద్యోగులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారు. 

అన్నీ గురుకులాల్లో విద్యాబోధన అంతా కూడా ఒక్కటే. చదువు చెప్పే టీచర్ల పనిదినాలు, సెలవులు అంతా సేమ్. అయితే, జీతాల విషయానికొచ్చేసరికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. 268 ఎస్సీ, 180 ఎస్టీ, 37 జనరల్ గురుకులాల్లో పనిచేసే సుమారు 400 మంది ఎస్జీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లకు రూ.18 వేల నుంచి రూ.23 వేల వరకు నెలకు జీతం చెల్లిస్తున్నారు. 330 బీసీ గురుకులాలలో పనిచేస్తున్న సుమారు 300 టీచర్లు, లెక్చరర్లకు రూ.24 వేల నుంచి రూ.27 వేల వరకు జీతమిస్తున్నారు. 205 మైనారిటీ గురుకులాల్లో అయితే జీతాలు మరీ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సుమారు 350 మంది టీచర్లకు, లెక్చరర్లకు రూ.30 వేల నుంచి రూ.37 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నట్లుగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు చెప్తున్నారు.

రిటైర్డ్ ఎంప్లాయీస్​కు  అడ్డాగా మైనారిటీ గురుకులాలు

రాష్ట్రంలో 205 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. ఇవి రిటైర్డ్ ఎంప్లాయీస్​కు అడ్డాగా మారిపోయాయి. అకడమిక్ కో ఆర్డినేటర్లు, విజిలెన్స్ టీమ్ పేరుతో ఇటీవల 50 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ను కాంట్రాక్ట్​, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు చెల్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఈ పనులను సీనియర్ ఎంప్లాయీస్ చేస్తున్నారు. 

అయితే, ప్రభుత్వ శాఖల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ను తీసుకోవద్దని రేవంత్ సర్కారు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయినా, మైనార్టీ గురుకులాల ఆఫీసర్లు సర్కారు ఆదేశాలను పక్కన పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన చోట ప్రభుత్వ పెన్షన్ డబ్బులు పొందుతున్న రిటైర్డ్ ఎంప్లాయీస్​కు ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా గురుకులాల్లో కిచెన్ కేటరింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్​కు ఇస్తే.. ఈ గురుకులాలలో ఒక్కో స్కూల్​కు ఐదుగురు చొప్పున ఉద్యోగులను నియమించుకొని సుమారు వెయ్యి మందికి నెల, నెల జీతం చెల్లిస్తున్నారు. అదీగాక ప్రత్యేకంగా వార్డెన్లను కూడా నియమించుకున్నారు. ఇతర గురుకులాలలో పనిచేస్తున్న సీనియర్ ఎంప్లాయీస్​కే ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. బడ్జెట్ ఎక్కువగా ఉందనో.. లేక మరేదైనా కారణమో తెల్వదు కానీ.. మైనార్టీలో ఇష్టారీతిన ఔట్ సోర్సింగ్​, కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్ నియామకాలు జోరుగా జరుగుతున్నట్లుగా గురుకుల ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి!

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో పనిచేసే కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లకు సమాన పనికి.. సమాన వేతనం అందించాలి. అన్నీ చోట్ల టీచర్లు, లెక్చరర్ల విద్యాబోధన, పనివిధానం ఒక్కటే అయినప్పుడు జీతాలు కూడా ఒకేలా చెల్లించాలి. వేర్వేరు శాఖలలో వేర్వేరు జీతాలు చెల్లించడంతో తక్కువ వేతనాలు పొందుతున్న టీచర్లు, లెక్చరర్లలో ఆత్మన్యూనత లోపించి అది విద్యాబోధనపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం కామన్ మెనూ లాగా.. కామన్​ సాలరీ విధానం పాటించాలి.