- ధాన్యం, బియ్యం, గన్నీ బ్యాగులు, ఎఫ్ఆర్కేలకు బీమా తప్పనిసరి
- సకాలంలో సీఎంఆర్ ఇవ్వకుంటే మిల్లుల బ్లాక్ లిస్టింగ్
- రైస్ మిల్లర్లకు కఠిన రూల్స్
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టకుండా సివిల్ సప్లయ్స్శాఖ మిల్లర్లతో కొత్త ఒప్పందాన్ని రూపొందించింది. 2026–27 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన ఈ అగ్రిమెంట్లో మిల్లర్ల బాధ్యతలను స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) పూర్తిస్థాయిలో, నిర్ణీత గడువులోగా అందించాలని స్పష్టం చేసింది.
ధాన్యం నిల్వలు తగ్గినా, పక్కదారి పట్టించినా, సీఎంఆర్ అప్పగించడంలో విఫలమైనా భారీ జరిమానా, వడ్డీతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకునేలా నిబంధనలు పొందుపరిచింది. మిల్లులకు కేటాయించిన ధాన్యం, గన్నీ బ్యాగులు, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్ఆర్కే) ప్రభుత్వ ఆస్తులుగానే పరిగణిస్తారు. సీఎంఆర్ పూర్తిగా అప్పగించే వరకు వాటి భద్రత, నిల్వ, వినియోగంపై పూర్తి బాధ్యత మిల్లర్లదే. 2027 సెప్టెంబర్ 30 వరకు లేదా సీఎంఆర్ డెలివరీ పూర్తయ్యే వరకు ఈ అగ్రిమెంట్అమలులో ఉంటుంది.
బ్యాంక్ గ్యారంటీ, ష్యూరిటీ మస్ట్
మిల్లర్లకు ధాన్యం కేటాయించేందుకు ఆర్థిక భద్రతను తప్పనిసరి చేసింది. గతంలో బకాయిలు, డిఫాల్ట్ చరిత్ర లేని మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యం విలువపై 10 శాతం బ్యాంక్ గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలి. గతంలో డిఫాల్ట్ అయి, బకాయిలు, జరిమానా పూర్తిగా చెల్లించిన మిల్లర్లు 20 శాతం బ్యాంక్ గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలి. బకాయిలు పూర్తిగా చెల్లించినా 25 శాతం జరిమానా పెండింగ్‌లో ఉన్నవారికి అదనపు భద్రత కల్పించాలి.
డిఫాల్టర్లకు మాత్రం కొత్తగా ధాన్యం కేటాయించరు. మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం కేటాయించే ధాన్యం విలువకు సరిపడా చెక్కులు ఇవ్వడంతో పాటు, ఆర్థికంగా పరిపుష్టి కలిగిన, గతంలో డిఫాల్ట్ కాని మరో ఇద్దరు మిల్లర్లు ష్యూరిటీ ఇవ్వాలి. లీజు మిల్లుల విషయంలో ధాన్యం కేటాయింపు విలువలో 50 శాతానికి ఈ-బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలి. యజమాని నుంచి నో డ్యూ సర్టిఫికెట్, లీజు ఒప్పంద పత్రాలతోపాటు ఇతర హామీలు ఇవ్వాలి.
ధాన్యం స్వీకరణ నుంచి డెలివరీ వరకూ..
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేసే సమయంలో మిల్లర్లు తమ ప్రతినిధిని ఉంచాలి. ధాన్యం రకం, నాణ్యత, పరిమాణాన్ని పరిశీలించి అంగీకరించాలి. ప్రతినిధి లేకపోయినా, ఆన్లైన్ లేదా రికార్డుల్లో నమోదైన ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించినట్టుగానే పరిగణిస్తారు. ఆ తర్వాత నాణ్యత, తూకం, రకం విషయంలో అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం ఉండదు. ధాన్యం స్వీకరించిన 3 రోజుల్లో మొత్తం వివరాలను అధికారులకు తెలియజేయాలి.
ధాన్యం, బియ్యం నిల్వలను వేర్వేరుగా ఉంచి తనిఖీలకు వీలుగా స్టాక్ నిర్వహించాలి. ప్రభుత్వం కేటాయించిన 7 సన్న రకాల ధాన్యాన్ని వేరుగా నిల్వ చేయడంతోపాటు, వాటి నుంచే సన్నబియ్యం తయారు చేయాలి. బియ్యం బస్తాలపై బియ్యం రకం పేరును స్పష్టంగా ముద్రించాలి. బాయిల్డ్ సీఎంఆర్‌లో 5 శాతం బ్రోకెన్, రా సీఎంఆర్‌లో 10 శాతం బ్రోకెన్‌తో కూడిన ఇంప్రూవ్డ్ రైస్ సరఫరా చేయాలి.
ఇందుకు అవసరమైన మిల్లింగ్ యంత్రాలను 2026–27 సీజన్ ప్రారంభానికి ముందే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. 2027–28 నుంచి 100 శాతం ఇంప్రూవ్డ్ రైస్ సప్లై చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మిగిలిన బ్రోకెన్ బియ్యాన్ని విడిగా నిల్వ చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. ఆ బ్రోకెన్ బియ్యాన్ని కూడా అప్పగించిన తర్వాతే సీఎంఆర్ సరఫరా పూర్తయినట్లు పరిగణిస్తారు. సాధారణ బియ్యంలో ప్రతీ 100 కిలోలకు ఒక కిలో చొప్పున ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్ఆర్కే) కలపాలి.
మాయం చేస్తే జరిమానా
గడువులోగా సీఎంఆర్ అందించకపోతే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకునేలా అగ్రిమెంట్లో నిబంధనలున్నాయి. మిల్లులో ధాన్యం నిల్వలు అందుబాటులో ఉంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని వేలం వేయవచ్చు. ఆ మొత్తాన్ని బకాయిల కింద జమ చేస్తారు. ధాన్యం నిల్వలు లేకపోతే ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యం విలువను రికవరీ ఖర్చులతోపాటు వసూలు చేస్తారు.
దీనికి అదనంగా 25 శాతం జరిమానా, 12 శాతం వార్షిక వడ్డీ విధిస్తారు. ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేట్ ధాన్యంతో కానీ, మరో సీజన్‌కు చెందిన ధాన్యంతో కానీ కలపకూడదు. పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద సరఫరా చేయడానికీ వీల్లేదు. సివిల్ సప్లయ్స్, జిల్లా యంత్రాంగం, ఎఫ్‌సీఐ అధికారులు ఎప్పుడైనా మిల్లుల్లో తనిఖీలు నిర్వహించవచ్చు. మిల్లర్లు ప్రతీ సోమవారం ధాన్యం స్వీకరణ, మిల్లింగ్, బియ్యం డెలివరీ వివరాలను అధికారులకు అందించాలి.
ఒపీఎంఎస్(ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో ధాన్యం స్వీకరణ, బియ్యం సరఫరా వివరాలను నమోదు చేయాలి. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు మిల్లింగ్ చార్జీలు, ఇతర బకాయిలను నిలిపివేస్తారు. షోకాజ్ నోటీసు ఇచ్చి, కనీసం 10 రోజుల గడువు తర్వాత బ్లాక్ లిస్టింగ్‌పై నిర్ణయం తీసుకోవాలి. గరిష్టంగా మూడేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తం ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ సరఫరా పూర్తయి, గన్నీ బ్యాగులు, ధాన్యం, ఎఫ్ఆర్కే లెక్కలు సరిపోల్చిన తర్వాతే బిల్లులు విడుదల చేస్తారు.
