ఐపీఎస్ నవీన్ పై కబ్జా కేసు.. అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు

ఐపీఎస్ నవీన్ పై కబ్జా కేసు.. అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి నవీన్‌‌కుమార్‌‌ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి (సీఈవో), రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంటిని ఆక్రమించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో నవీన్‌‌కుమార్‌‌‌‌ను సిటీ సీసీఎస్ పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సీసీఎస్‌‌కు తరలించి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం 41ఏ సీఆర్‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. 

సొంతింటిని అద్దెకిచ్చిన భన్వర్ లాల్ 

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ భన్వర్ లాల్ ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కలెక్టర్​గా, తెలంగాణ వచ్చాక స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా పని చేశారు. ఆయనకు జూబ్లీహిల్స్‌‌ ప్రశాసన్‌‌నగర్‌‌ రోడ్‌‌ నంబర్‌‌71లో ప్లాట్‌‌ నంబర్‌‌‌‌114లో ఒక సొంత ఇల్లు ఉంది. ఐఏఎస్​గా ఉన్నందున ఆయన అధికారిక క్వార్టర్స్​లో ఉండేవారు. భన్వర్ లాల్ ఇంటిని అద్దెకు తీసుకునేందుకుగాను ఆయన భార్య మణిలాల్ ను ఒరుసు సాంబశివరావు అనే వ్యక్తి 2014, అక్టోబర్ 14న కలిశాడు. టీఎస్ పోలీస్ అకాడమీలో అప్పటి డిప్యూటీ డైరెక్టర్, ఐపీఎస్ నవీన్ కుమార్ భట్ తమ సోదరుడు అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. దీంతో తమ ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు మణిలాల్‌‌ అంగీకరించారు. 2014 నవంబర్ 1 నుంచి ఐదేండ్ల కాలానికి రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

ఇల్లు ఖాళీ చేయని సాంబశివరావు 

భన్వర్ లాల్ 2019, జూన్ లో రిటైర్ అయిన తర్వాత అధికారిక నివాసం ఖాళీ చేశారు. ప్రశాసన్‌‌ నగర్‌‌‌‌లోని తన సొంతింటికి రావాలనుకున్నారు. తమ ఇంటిని ఖాళీ చేయాలని కోరగా సాంబశివరావు నిరాకరించాడు. అదే ఇంట్లో ఐపీఎస్‌‌ అధికారి నవీన్‌‌కుమార్‌‌‌‌ కూడా అక్రమంగా నివాసం ఉంటున్నారు. 2020 జనవరి నుంచి అద్దె కూడా చెల్లించడం లేదు. అప్పటినుంచి భన్వర్‌‌‌‌లాల్‌‌ తన భార్య మణిలాల్‌‌తో కలిసి ఓల్డ్‌‌ అల్వాల్‌‌లోని హెచ్‌‌ఎంటీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 

ఏ2గా నవీన్ కుమార్ 

మణిలాల్‌‌ ఫిర్యాదు మేరకు చీటింగ్‌‌, ఫోర్జరీ సహా నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా సాంబశివరావును, రెండవ నిందితుడిగా నవీన్‌‌కుమార్‌‌‌‌ను, మూడవ నిందితురాలిగా సాంబశివరావు భార్య రూప డింపుల్‌‌ను చేర్చారు. సాంబశివరావు, రూప డింపుల్‌‌ను ఈ నెల 22న అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఐపీఎస్ నవీన్‌‌కుమార్‌‌‌‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోవడంతో బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సీసీఎస్‌‌కు తరలించి విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపించారు.  

బీసీ ఆఫీసర్ పై అక్రమ కేసు: ఆర్. కృష్ణయ్య  

బషీర్ బాగ్, వెలుగు: ఐపీఎస్ నవీన్ కుమార్​ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. నిజాయితీపరుడైన బీసీ అధికారిని తప్పుడు ఫిర్యాదుతో కేసులో ఇరికించారని ఆరోపించారు. బుధవారం కాచిగూడలో ఐపీఎస్ నవీన్ కుమార్ కొడుకు సాహిత్​తో కలిసి కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. పోలీసు శాఖలో గత పదేండ్లుగా బీసీ ఆఫీసర్లపై వేధింపులు జరుగుతున్నాయన్నారు. నవీన్ కుమార్​కు త్వరలో ప్రమోషన్ రావాల్సి ఉందని, అందుకే కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు. సాహిత్ మాట్లాడుతూ.. పోలీసులు ఒక సివిల్ కేసులో తన తండ్రిని అక్రమంగా ఇరికించి వేధిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు.   

ఫోర్జరీ సంతకాలతో  ఫేక్ డాక్యుమెంట్లు 

భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేయకుండానే సాంబశివరావు 2020 సెప్టెంబర్‌‌18న నాలుగు చెక్కులు ఇచ్చాడు. రూ.11.10 లక్షలకు సంబంధించి వివిధ తేదీలతో పోస్ట్‌‌డేటెడ్ చెక్స్ ఇవ్వగా అవన్నీ బౌన్స్‌‌ అయ్యాయి. దీంతో భన్వర్‌‌‌‌లాల్‌‌ అక్టోబర్‌‌ 14న చెక్‌‌ బౌన్స్ కేసులు ఫైల్ చేశారు. ఈ కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలా ఉండగా.. సాంబశివరావు, నవీన్‌‌కుమార్‌‌‌‌ కలిసి ఫోర్జరీ సంతకాలతో ఫ్యాబ్రికేటెడ్‌‌ డాక్యుమెంట్లు తయారు చేశారు. భన్వర్‌‌‌‌లాల్‌‌ కుటుంబ సభ్యులకు లీగల్‌‌ నోటీస్ పంపించారు. దీంతో తమ ఇంటిని సొంతం చేసుకునేందుకు సాంబశివరావు, రూప డింపుల్, నవీన్ కుమార్ ప్రయత్నించారంటూ గత నెల 17న మణిలాల్ సిటీ సీసీఎస్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.