బీసీల వాటా పోరాటంలో దేశానికి తెలంగాణ ఆదర్శం ..పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీసీల వాటా పోరాటంలో దేశానికి తెలంగాణ ఆదర్శం ..పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ  మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం కోసం తెలంగాణలో ఇటు ప్రభుత్వం.. అటు పార్టీ  చేపట్టిన చర్యలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.  బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
(సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

 బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన  చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పడానికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. కులగణన చేసి బీసీల పక్షపాతిగా కాంగ్రెస్ నిలిచిందన్నారు. బీసీలకు వాటా, ఓట్ చోరీపై  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఉద్యమాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ ను బాగా పెంచాయని అన్నారు.

దేశ ప్రజల్లో వీటికి  మంచి స్పందన వచ్చిందనన్నారు. ఓట్ చోరీతోనే కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని మహేశ్​గౌడ్​చెప్పారు. ప్రజా పోరాటంలో బీజేపీపై కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందన్నారు. 

రాహుల్ గాంధీ చూపిన మార్గంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు నడుస్తున్నారని చెప్పారు. దీంతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేసే దశకు తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొన్నారు.