- రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పలువురు మంత్రులు
- ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అట్టహాసంగా వేడుకలు
నెట్వర్క్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు మంత్రులు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయా జిల్లాలో వారు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను సన్మానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. మెదక్ లో కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికను చదివి వినిపించారు.
సంగారెడ్డిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్యులు చెప్పినట్లుగా తెలంగాణ కోటి రత్నాల వీణ.. నేడు అభివృద్ధి రాగాలు పలుకుతోందన్నారు. కాళోజీ నారాయణరావు కలలు కన్న ప్రజా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
సూర్యాపేట కలెక్టరేట్‌లో నీటి పారుదల, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచేలా తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 5 కోట్ల 13 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం పొంది రూ.307 కోట్ల 22 లక్షలను ఆదా చేసుకున్నారని వివరించారు.
నల్లగొండలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. నాడు తెలంగాణ ఆకాంక్ష కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా విసిరికొట్టి, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చరిత్ర నల్లగొండ గడ్డకు ఉందని ఆయన గుర్తుచేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పాలనను గాడిలో పెడుతోందన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో క్రీడలు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలలో రూ. 58.54 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, జిల్లాకు మొత్తం 6,526 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 1,151 ఇండ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు కూడా జరిగాయని వివరించారు.
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.వనపర్తి జిల్లా ఐడీఓసీ ప్రాంగణంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి పథకాల ద్వారా సంపదను ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేస్తున్నామని వివరించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితెందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సమగ్ర ప్రగతి లక్ష్యంగా అడుగులు వేస్తోందని, జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని అన్నారు. ఇక ఆయాచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు వేడుకల్లో పాల్గొని ప్రభుత్వ పథకాల అమలును వివరించారు.
