పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో తెలంగాణకు తీవ్ర నష్టం

పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో తెలంగాణకు తీవ్ర నష్టం

హైదరాబాద్, వెలుగుపోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే తెలంగాణ ప్రయోజనాలకు పెద్ద గండి పడుతుంది. ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీల వరకు తరలించుకుపోయేందుకు, శ్రీశైలం రిజర్వాయర్​లోని నీళ్లన్నింటినీ పూర్తిగా తోడుకునేందుకు ఏపీకి వీలు చిక్కుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే అక్రమంగా మొదలైన ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్​తోపాటు దాదాపు దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటా కటకట తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించుకునేందుకు పోతిరెడ్డిపాడు గండి (హెడ్​ రెగ్యులేటర్)కు డిజైన్​ చేశారు. మొదట 11,500 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న ఆ గండిని.. ఉమ్మడి ఏపీలోనే 44 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచారు. తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పుడు అదే గండిని మరోసారి డబుల్​ చేసుకునేందుకు ఏపీ రెడీ అయింది. 80 వేల క్యూసెక్కుల కెపాసిటీ అంటే రోజుకు సుమారుగా ఎనిమిది టీఎంసీల నీళ్లు వెళ్లిపోతాయి. అంటే.. అత్యంత భారీగా, 80 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మనం లిఫ్ట్ చేసుకునే గోదావరి నీళ్లతో పోల్చుకుంటే మూడు రెట్ల నీళ్లను ఏపీ తరలించుకుపోతుంది.

వరద పేరుతో మళ్లింపు

శ్రీశైలం రిజర్వాయర్​ గరిష్ట నీటి నిల్వ మట్టం 885 అడుగులు. అందులో కనీసం 854 అడుగుల వరకు నీరు చేరినా.. ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో నీళ్లు తరలించుకునే వీలుంది.ఇప్పుడున్న కెపాసిటీ ప్రకారం 44 వేల క్యూసెక్కుల నీళ్లు (రోజుకు నాలుగు టీఎంసీలు) సీమకు తరలిపోతాయి. నాగార్జునసాగర్​ ఎడమ కాల్వ కెపాసిటీతో పోలిస్తే అది నాలుగు రెట్లు ఎక్కువ. అలాంటి గండిని డబుల్​ చేస్తే ఏపీ శ్రీశైలం రిజర్వాయర్​లో చుక్క నీళ్లు లేకుండా తోడేసే ముప్పు ఉందని ఇరిగేషన్​ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం వరద ఉండే రోజుల్లోనే నీటిని తరలిస్తామని ఏపీ చెబుతోంది. శ్రీశైలంలో నిండా 885 అడుగులదాకా నీళ్లుండి, దిగువన నాగార్జునసాగర్​ కూడా పూర్తిగా నిండి.. సముద్రంలోకి వెళ్లిపోతుంటే ఆ నీటిని వరద జలాలు అంటారు. అలాంటిది శ్రీశైలంలో 805 అడుగుల లోతుకు నీటి మట్టం పడిపోయినా కూడా తోడేసుకునేలా గండి వెడల్పు చేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ముందు నుంచీ అక్రమమే!

పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ కెపాసిటీ పెంపునకు అసలు చట్టబద్ధత లేదని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందే బ్రిజేష్​ ట్రిబ్యునల్​ ముందు వాదన వినిపించింది. ఉమ్మడి ఏపీలో అక్రమంగా 44 వేల క్యూసెక్కులకు పెంచడం, శ్రీశైలం పవర్ హౌస్ నుంచి కరెంట్​ఉత్పత్తికి వాడే 5 వేల క్యూసెక్కులనూ వాడేసుకోవడంపై ఆధారాలను కూడా సమర్పించింది. సుప్రీంలో పిటిషన్ వేసింది. కానీ ఒకటి రెండేళ్లుగా కృష్ణా నీళ్ల వినియోగం విషయంలో రాష్ట్ర సర్కారు సైలెంట్​గా ఉండటంతో ఏపీ కొత్త ప్రాజెక్టుల జీవో జారీ చేసింది.

అన్నీ ఉల్లంఘనలే..

ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టరాదనే నిబంధనను ఏపీ తుంగలో తొక్కింది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​కు ఎగువన సంగమేశ్వరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీమ్​తో నీటిని తరలించేలా కొత్త ప్రాజెక్టుకు డిజైన్ ​చేసింది. అందులో భాగంగానే పోతిరెడ్డిపాడును 80 వేల క్యూసెక్కుల స్థాయికి వెడల్పు చేస్తోంది. వాస్తవానికి రూల్స్​ ప్రకారం ఒక నదీ ప్రాంతం నుంచి మరో నదీ ప్రాంతానికి నీళ్లను తరలించొద్దు. కానీ ఏపీ సర్కారు మాత్రం కృష్ణా నీటిని ఇష్టారాజ్యంగా పెన్నా నదీ బేసిన్​కు తరలించుకు పోతోంది.

నీటి కోటాల్లోనూ చేతివాటం

ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ప్రాజెక్టుల వారీగా ఆ కేటాయింపులు జరగకపోవడంతో ఇరు రాష్ట్రాలు వాటి సరిహద్దుల పరిధిలోని ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా (అడ్‌హక్‌గా) వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వచ్చే నీటిని 34:66 నిష్పత్తిలో వాడుకోవాలి. కానీ ఏపీ ఏటా 70 శాతానికి మించి నీటిని వాడుకుంటోంది.

సాగర్​ ఆయకట్టుకు అందేదెట్లా?

కృష్ణా నదిలో వరద ప్రవాహాల్లేక ఏటా ఆగస్టు చివరి వరకు కూడా నాగార్జున సాగర్​ ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యం అవుతోంది. ఆగస్టులో వరద వచ్చిన తర్వాత కూడా.. 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీశైలం నిండిపోయి, సాగర్‌ కు నీరొచ్చేందుకు నెల రోజులకుపైగా పడుతోంది. ఇప్పడు శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడుతో గండి కొడితే.. సాగర్​కు నీళ్లు చేరటం గగనమే. అదే జరిగితే 6.40 లక్షల ఎకరాల ఆయకట్టు, ఏఎంఆర్‌పీ తాగు, సాగు నీటి అవసరాలకు పూర్తిగా విఘాతం తప్పదు.

కల్వకుర్తికి చుక్క నీళ్లు రావు

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రాజెక్టు శ్రీశైలంపైనే ఆధారపడి ఉంది. 810 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే ఈ లిఫ్ట్ పని చేస్తుంది. దీని నుంచి మూడు రోజులకొక టీఎంసీ నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. అదే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తితే ఇప్పడున్న లెక్కన రోజుకు నాలుగు టీఎంసీలు.. కెపాసిటీ పెంచితే రోజుకు ఎనిమిది టీఎంసీలకు బుంగ పడ్డట్టే. ఏపీ 805 అడుగుల వరకు నీటిని తోడేస్తే.. కల్వకుర్తికి చుక్క నీళ్లుకూడా రాని పరిస్థితి ఉంటుంది. సుమారు 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రమాదమే.

పాలమూరు.. ఎల్లూరు.. అన్నీ ఎండుడే..

కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా 15 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా రాష్ట్ర సర్కారు ప్లాన్​ చేసింది. శ్రీశైలంకు వచ్చే నీటిని వచ్చినట్లుగా ఏపీ గ్రావిటీతో లాగేస్తే.. ఈ ప్రాజెక్టులకు నీరందే అవకాశం లేదు. ఇక శ్రీశైలం బ్యాక్​ వాటర్​లోనే ఎల్లూరు రిజర్వాయర్‌ ఉంది. దీని నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా తాగునీటికోసం మిషన్‌ భగీరథ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంటుంది. శ్రీశైలంలో 815 అడుగులకుపైన నీళ్లుంటేనే తాగునీటికోసం తీసుకోవచ్చు. తగ్గితే తీసుకోవడం కుదరదు. అదే జరిగితే తాగునీటికి కష్టాలు తప్పవు. శ్రీశైలం ఎగువన ఉండే జూరాల నుంచే నీటిని తీసుకుందామనుకున్నా.. దాని కెపాసిటీ కేవలం 7 టీఎంసీలు మాత్రమే. దానిమీద ఇప్పటికే కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి.

పోతిరెడ్డిపాడును అడ్డుకోకుంటే తిరుగుబాటే