మితిమీరిన అప్పులు.. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థ

మితిమీరిన అప్పులు.. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వాల ఆర్థిక విధానాలకు ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి దశ దిశ చూపించే లక్ష్యాలు ఉండాలి. ఉద్యోగ,- ఉపాధి కల్పన, సుస్థిరమైన అభివృద్ధి, వివిధ సామాజిక వర్గాల మధ్య గల అసమానతలను తగ్గించడం ప్రభుత్వ విధి. రాష్ట్ర  ప్రభుత్వ ఆర్థిక విధానాలు మానవాభివృద్ధికి ఉపయోగపడాలి. గత ఎనిమిదేండ్ల పాలనలో ప్రజల నుంచి వసూలు చేసే అన్ని రకాల పన్నులు రెండు వందల శాతం మించి పోయాయి. అయినా ఖజానాలో డబ్బులు లేక మానవాభివృద్ధిలో కీలకమైన  విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగాల రంగాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. 

మిగులు బడ్జెట్​తో మొదలై..

తెలంగాణ ఏర్పాటు సమయంలో మిగులు బడ్జెట్​తో మొదలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఇప్పటికే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు కాగా, ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల పేరుతో లక్ష కోట్ల రూపాయల రుణ భారం ఉంది. ప్రస్తుతం వివిధ అవసరాల కోసం నెలవారి రాష్ట్ర ఖర్చులు16 నుంచి 17 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇందులో ప్రతి నెలా కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుల వాయిదాలు, వాటికి సంబంధించిన నెలవారి వడ్డీలకే సరిపోతోంది. ఇల్లు పీకి పందిరి వేసినట్లు.. కొత్త అప్పులు తెచ్చి తిరిగి పాత బకాయిలు, వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్ లు కలిపి ప్రతి నెల దాదాపు 5 వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీత భత్యాలు ఒకటో తారీకు ఇవ్వాల్సింది పోయి.. 10వ తారీకు వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల ఆదాయ వనరుల నుంచి దాదాపు పదివేల కోట్ల రూపాయలు మాత్రమే వస్తుండగా.. కనీసం మరో 6 నుంచి 7 వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడుతున్నది. 

నిధుల కోసం పడిగాపులు..

నిధులు లేక ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్ల మరమ్మతులు, ఇతర కాంట్రాక్టు పనులు చేయించుకొని బిల్లులు చెల్లించడం లేదు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. కొత్త ఆసరా పింఛన్ల కోసం నాలుగు లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం బడులు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించడానికి కూడా చిల్లిగవ్వ ఇవ్వడం లేదు. సర్కారు దవాఖానాలకు సరిపడా నిధులు అందడం లేదు. ఫలితంగా మన రాష్ట్రం విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో దేశంలో కింది స్థానానికే పరిమితం కావల్సి వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ రెండు లక్షల 56 వేల కోట్లు చూపించినప్పటికీ రూ. 60 వేల కోట్లకు మించి లోటు ఉన్నది. ఇప్పటికే ప్రజల నుంచి అనేక రకాల పన్నులు, పెనాల్టీలు ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తున్న సర్కారు.. మద్యం విక్రయాలతో దాదాపు రూ. 40 వేల కోట్ల, రిజిస్ట్రేషన్లు, వాహనాల పన్ను , విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి మరింత ఆమ్దానీ పెంచుకుంటోంది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పెట్రోలు, డీజిల్, గ్యాస్, మద్యం ధరలు, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చార్జీలు, కరెంట్ చార్జీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పెనాల్టీలు, ఫాస్ట్ డ్రైవింగ్ పెనాల్టీలు, ఆర్టీవో చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, సుద్ధ, ఎర్రమట్టి ఖనిజాలపై పన్ను, ఇసుక దిబ్బలపై పన్నులు ఎక్కువ కావడం గమనార్హం. 

విద్య, వైద్యంపై పెట్టుబడి పెట్టాలె..

రాష్ట్రాలు రుణ నియంత్రణ హద్దులు దాటి పోతున్న సందర్భంలో ఎఫ్ఆర్​బీఎం చట్టం ప్రకారం.. కేంద్రం వాటికి కళ్లెం వేయడం ప్రారంభించింది. అనేక రాష్ట్రాలు తమ పరిమితికి మించి అప్పులు చేసి ఆర్థిక  వ్యవస్థలను అప్పుల ఊబిలోకి దించుతున్నాయని కేంద్రం రుణ పరిమితి నియంత్రణ చర్యలను చేపట్టింది. ఈ చర్యలు చేపట్టకపోతే ద్రవ్యోల్బణం అదుపు తప్పి దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉంది. అప్పులు చేయడం తప్పుకాకపోయినా.. తెచ్చిన రుణాలను ఉచిత పథకాల కోసం వెచ్చించడం నష్టమే. రాష్ట్రంలో ఎదుగుతున్న యువకులకు పారిశ్రామిక, సేవా రంగాల్లో అవకాశాలు కల్పించే పెట్టుబడులకు, మానవ వనరులను అభివృద్ధి చేసే విద్య, వైద్య రంగాలపై రుణాలను పెట్టుబడిగా పెడితే వాటిని తిరిగి పొందే ఆస్కారం ఉంటుంది. 

- కూరపాటి వెంకటనారాయణ
సోషల్ ​ఎనలిస్ట్