దసరా సెలవుల్లో చూసొద్దామా : తెలంగాణ ఐలాండ్స్.. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లే

దసరా సెలవుల్లో చూసొద్దామా : తెలంగాణ ఐలాండ్స్.. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లే

రిలాక్సేషన్ తో పాటు కొత్త ప్లేస్ కు వెళ్లిన అనుభూతి ఉండాలనుకుంటారు ట్రావెలర్స్. అలాంటివాళ్లకి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తాయి. అక్కడికి వెళ్తే గుంపులు గుంపులుగా తిరుగుతున్న రంగురంగుల పక్షుల్ని చూస్తూ, వాటి కిలకిలరావాల్ని వింటూ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. అలా వెళ్లేందుకు హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న మంజీర వైల్డ్ లైఫ్ శాంక్చురీ బాగుంటుంది. ఇక్కడి పచ్చని చెట్లు, మధ్యలో అక్కడక్కడా ఉన్న ఐలాండ్స్ టూరిస్టులకి కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ శాంక్చురీ సంగారెడ్డి జిల్లాలోని కాలబూర్లో ఉంది. మంజీర, సింగూరు బ్యారేజీల మధ్యలో దాదాపు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ శాంక్చురీని మొదట్లో అంతరించిపోయే దశలో ఉన్న 'మగ్గర్ మొసళ్ల'ని కాపాడేందుకు ఏర్పాటుచేశారు. ఇతర ప్రాంతాల నుంచి వింటర్ సీజన్లో రకరకాల పక్షులు ఇక్కడికి వలస వచ్చేవి. వాటిని చూసేందుకు జనం ఎక్కువగా వచ్చేవాళ్లు. దాంతో దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డెవలప్ చేశారు. ఇందులో ' దాదాపు 70 రకాల పక్షులు ఉన్నాయి. బోటు షికారు చేస్తూ పక్షుల్ని చాలా దగ్గరగా చూడొచ్చు. మంజీర రిజర్వాయర్లో తొమ్మిది చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్స్ మీద మొసళ్లు గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు చేస్తాయి. ఈ శాంక్చురీలో మొసళ్లు, పెద్ద సైజు తాబేళ్లు, మంచి నీటి తాబేళ్లు, తెల్లని అంచు ఈకలున్న బాతులు, ఆరెంజ్ రంగులో ఉండే రద్దీ షెల్టిక్స్ స్పెషల్ అట్రాక్షన్. అంతరించిపోయే దశలో ఉన్న పెయింటెడ్ స్టార్క్, ఓరియెంటల్ వైట్ ఇబిస్ వంటి వలస పక్షులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. ఇందులో మ్యూజియం, లైబ్రరీతో పాటు ఆడిటోరియం కూడా ఉంది. ఇందులో పక్షులు, జంతువులకి సంబంధించిన వీడియోలు ప్లే చేస్తారు. నవంబర్, మార్చి నెలల మధ్యలో మంజీర వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తే రకరకాల పక్షుల్ని చూడొచ్చు. ఇక్కడ నీళ్లలో సగం వరకు మునిగిన రకరకాల మొక్కలు పెరుగుతాయి.

పురాతన త్రికూటాలయం

కాలబ్ గూర్ ని కులబూర్ అని కూడా అంటారు. ఈ ఊళ్లో మంజీర నది ఒడ్డున కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంటుంది. ఇది ఒక పురాతన శివాలయం. ఇది త్రికూటాలయం కూడా. దీన్ని 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు కట్టించారు. ఈ గుడి నిర్మాణశైలి హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ దేవాలయంలో అనంత పద్మనాభస్వామి, వేణుగోపాల స్వామి విగ్రహాల్ని చూడొచ్చు. ఇక్కడి గర్భగుడిలో ఒకచోట నాణాన్ని పడేస్తే, ఆ నాణెం నీళ్లలో పడినట్టు శబ్దం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఊళ్లో కాకతీయుల కాలానికి చెందిన అతిపురాతనమైన సంగమేశ్వర టెంపుల్ కూడా ఉంది.

ఇలా వెళ్లాలి

సంగారెడ్డి నుంచి 5 కి.మీ దూరంలో ఉంటుంది. మంజీర వైల్డ్ లైఫ్ శాంక్చురీ. హైదరాబాద్ నుంచి అయితే 64 కి.మీ జర్నీ.

ALSO READ : IND vs PAK: పెవియన్‌కు క్యూ కట్టిన పాక్ బ్యాటర్లు... ఏడు వికెట్లు డౌన్