డీఎస్సీ అప్లికేషన్లు లక్ష తగ్గినయ్

డీఎస్సీ అప్లికేషన్లు లక్ష తగ్గినయ్
  • గతంలో 2.77లక్షలు..ఈసారి 1.77 లక్షలు
  • పోస్టులు తక్కువగా ఉండటంతో అప్లైకి విముఖత

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మొత్తం 5,089 పోస్టుల భర్తీకి 1,77,502 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేశారు. పోస్టులు చాలా తక్కువగా ఉండటంతోనే నిరుద్యోగ అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదని స్పష్టమవుతున్నది. సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 20తోనే గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో మళ్లీ 29 వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఇచ్చారు. 

మొత్తం 1,79,297 మంది ఫీజు చెల్లించారు. వీరిలో 1,795 మంది అప్లై చేసుకోలేదు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా హైదరాబాద్​లో 14,187 మంది అప్లై చేసుకోగా, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 1,338 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లలో ఎస్​జీటీ తెలుగు మీడియం పోస్టులకు 60,460 మంది దరఖాస్తు చేసుకోగా, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మీడియంలో 28,019 మంది, ఎస్ఏ బయోలజికల్ సైన్స్ పోస్టులకు 22,646 మంది అప్లై చేశారు. అయితే, ఈసారి 5,089  టీచర్ పోస్టులు ఉన్నా, చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్​లోనే పోస్టులున్నాయి. 

కొన్ని జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు లేనే లేవు. దీంతో అభ్యర్థులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించ లేదు. మరోపక్క ఇటీవల టీఎస్ టెట్ పరీక్ష జరగ్గా, దాంట్లో తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. టీఆర్టీ 2017లో 8,792 పోస్టుల కోసం 2,77,574 మంది అప్లై చేసుకున్నారు. ఈ లెక్కన దాదాపు లక్ష అప్లికేషన్లు తక్కువగా వచ్చాయి. కాగా, ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. అధికారికంగా ఇంకా కొత్త తేదీలను ప్రకటించ లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.