తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

ప్రముఖ ప్రజాస్వామ్య రాజ్యాలైన అమెరికా, కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, ఆస్ట్రేలియా రాజ్యాంగాల్లో పౌరుల విధులకు సంబంధించిన జాబితాలు ప్రత్యేకంగా లేవు. జపాన్​ రాజ్యాంగం మాత్రమే పౌరుల విధుల జాబితా కలిగిన ఏకైక ప్రజాస్వామ్య రాజ్యాంగం. వీటికి విరుద్ధంగా సామ్యవాద దేశాల్లో పౌరుల హక్కులు, విధులకు సమాన ప్రాముఖ్యం ఉంది. అందుకే పూర్వ సోవియట్​ యూనియన్ రాజ్యాంగంలో పౌరుల విధులు, కర్తవ్యాలు, హక్కులు, స్వేచ్ఛలు విడదీయరానివని ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులపై పూర్వపు సోవియట్​ యూనియన్​ రాజ్యాంగ ప్రభావం ఉంది.

మూల రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రాథమిక విధులు లేవు. దేశంలో అంతరంగిక అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలం(1975–77)లో అధికార కాంగ్రెస్​ ప్రభుత్వం 1976లో  ప్రాథమిక విధుల గురించి సిఫారసులు చేయడం కోసం స్వరణ్​సింగ్​ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాజ్యాంగంలో ప్రాథమిక విధులపై ప్రత్యేక అధ్యాయం ఉండాలని, హక్కులను అనుభవించడంతోపాటు విధులను నిర్వర్తించాలనే స్పృహ లేదా చైతన్యం పౌరులకు ఉండాలని సూచించింది.

స్వరణ్​ సింగ్​ కమిటీ సిఫారసులను అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఆమోదించింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం–1976 ద్వారా రాజ్యాంగంలో 4A అనే కొత్త భాగం చేర్చారు. ఈ కొత్త భాగంలో 51A  ప్రకరణ ఉంది. ఈ ప్రకరణ మొదటిసారిగా పౌరులకు 10 ప్రాథమిక విధులతో కూడిన నియమావళిని ఏర్పరిచింది. స్వరణ్​ సింగ్​ కమిటీ ఎనిమిది ప్రాథమిక విధులను సూచించినప్పటికీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం–1976 పది ప్రాథమిక విధులను పొందుపరిచింది. 

ఆమోదించని సిఫారసులు

స్వరణ్​ సింగ్​ కమిటీ సూచించిన కింది సిఫారసులను కాంగ్రెస్​ పార్టీ ఆమోదించలేదు. ఈ కారణంగా రాజ్యాంగంలో పొందుపరచలేదు. 

విధి నిర్వహణ వైఫల్యం, విధులను నిర్వర్తించడానికి నిరాకరించడంపై పార్లమెంట్​ సముచితమైన జరిమానాలు, శిక్షలు విధించవచ్చు. 

 ఏ ప్రాథమిక హక్కులకైనా భంగకరమని లేదా రాజ్యాంగంలోని ఏ అంశాలకైనా ప్రతికూలమని పార్లమెంట్​ విధించిన జరిమానాలు కానీ శిక్షలు కానీ ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.

పన్నులు చెల్లించడం పౌరుల ప్రాథమిక విధి

పార్టీల వ్యతిరేకత

కాంగ్రెస్​ ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. కానీ అత్యవసర పరిస్థితి తర్వాత కాలంలో ఏర్పడిన మొరార్జీ దేశాయ్​ నాయకత్వంలోని జనతా  పార్టీ ప్రభుత్వం ప్రాథమిక విధులను రద్దు చేయలేదు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం–1976 ద్వారా రాజ్యాంగంలో చేసిన అనేక మార్పులను 43వ రాజ్యాంగ సవరణ చట్టం–1977, 44వ రాజ్యాంగ సవరణ చట్టం–1978ల ద్వారా తొలగించింది. కానీ ప్రాథమిక విధులను మాత్రం కొనసాగించింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించాలనే ప్రాథమిక విధిని చేర్చారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 

లక్షణాలు

 ప్రాథమిక విధుల్లో కొన్ని నైతిక విధులు, మరికొన్ని పౌర విధులు ఉన్నాయి. 

భారత సాంప్రదాయాలు, పురాణాలు, మతాలు, ఆచారాల విలువలను ఇవి నిర్దేశిస్తాయి. 

  ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే నిర్దేశించబడ్డాయి. 

ఆదేశిక సూత్రాల లాగానే ప్రాథమిక విధులూ న్యాయ నిర్హేతమైనవి కావు. వీటి అమలు కోసం న్యాయస్థానాలకు గల అధికారం రాజ్యాంగం వివరించలేదు. అయితే, పార్లమెంట్​ వీటి అమలు కోసం సముచితమైన చట్టాలు చేయవచ్చు.  

విధుల అమలుపై కమిటీ 

ప్రాథమిక విధుల అమలు తీరును అధ్యయనం చేయడానికి 1998లో జస్టిస్​ జేఎస్​ వర్మ కమిటీని నియమించారు. ప్రాథమిక విధుల అమలు కోసం రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు లేవని వర్మ కమిటీ గుర్తించింది. కానీ పార్లమెంట్​ వివిధ సందర్భాల్లో రూపొందించిన చట్టాల ఆధారంగా కొన్ని ప్రాథమిక విధులను అమలు చేయడానికి ఆస్కారం ఉందని సూచించింది. 

చట్టాలు

జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టం 1971 భారత రాజ్యాంగానికి, జాతీయ పతాకానికి, జాతీయ గీతానికి జరిగే అగౌరవాన్ని నిరోధిస్తుంది. 

భాష, జాతి, జన్మస్థలం, మతం తదితర అంశాల ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే వారిని శిక్షించడానికి చాలా క్రిమినల్​ చట్టాలు ఉన్నాయి.

పౌర హక్కుల పరిరక్షణ చట్టం – 1955 ప్రకారం కులం, మతాలకు సంబంధించి నేరాలకు ఇది శిక్షలను విధిస్తుంది. 

ఇండియన్ పీనల్​ కోడ్​ ప్రకారం జాతీయ సమగ్రతకు భంగకరమైన ఆరోపణలు, అభిప్రాయాలు శిక్షార్హమైన నేరాలు. 

 ప్రజా  ప్రాతినిధ్య చట్టం–1951 కులం, జాతి, భాష, మతం మొదలైన కారణాలపై ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, మతం పేరుతో ఓట్లు అడగడం, వివిధ అనైతిక చర్యలకు పాల్పడే పార్లమెంట్​, రాష్ట్ర శాసనసభలకు అనర్హతలు నిర్ధారిస్తుంది.

వన్యప్రాణుల(రక్షణ) చట్టం, 1972 అరుదైన జీవజాతుల వ్యాపారాన్ని నిషేధిస్తుంది.

అడవుల(సంరక్షణ) చట్టం 1980 విచక్షణారహితంగా అడవులను నిర్మూలించడాన్ని, అటవీ భూములను ఇతరత్రా ఉపయోగాన్ని నిషేధిస్తుంది. 

1. మూల రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? (4) 

1) 9 2) 10 3) 11 4) విధుల ప్రస్తావన లేదు

2. ఏ కమిటీ సిఫారసు మేరకు రాజ్యాంగంలో  ప్రాథమిక విధులను చేర్చారు? (2)
1) జేఎస్​ వర్మ కమిటీ 2) స్వరణ్​ సింగ్​ కమిటీ
3) తార్కుండే కమిటీ 4) బీఎస్​ వర్మ కమిటీ 

3. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? (1) 
1) 1976  2) 1977  3)1978  4) 1979

4. ప్రాథమిక విధుల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ? (1) 
 1) జేఎస్​ వర్మ కమిటీ 2) స్వరణ్​ సింగ్​ కమిటీ
3) తార్కుండే కమిటీ 4) బీఎస్​ వర్మ కమిటీ 


5. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి?(3) 
1) 9      2) 10          3) 11             4) 12

ప్రాథమిక విధులు

a. రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, గీతాన్ని గౌరవించాలి.

b. స్వాతంత్ర్య పోరాటపు ఆదర్శాలను కాపాడాలి. 

c. దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలి.

d. దేశ రక్షణకు, సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

e. ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి మాతృభాష, వర్గ, ప్రాంతీయ విభేదాలను అధిగమించాలి. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే చర్యను వీడాలి.

f. దేశ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడాలి.

g. అడవులు, నదులు, సరస్సులు వంటి పర్యావరణాన్ని కాపాడాలి. వన్య ప్రాణులను సంరక్షించి జీవకోటి పట్ల కారుణ్యం కలిగి ఉండాలి.

h. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి.

i. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి.

j. వ్యక్తి అన్ని రంగాల్లో ఔన్నత్యం సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలి.

k. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించాలి.