తెలంగాణ జాబ్స్ స్పెషల్: తెలంగాణ ప్రాంతీయ కమిటీ

తెలంగాణ జాబ్స్  స్పెషల్:  తెలంగాణ ప్రాంతీయ కమిటీ

భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని ఫజల్​ అలీ కమిషన్​ పేర్కొంది. కానీ విశాలాంధ్ర విషయానికి వచ్చేసరికి తెలంగాణ ప్రజల భయాందోళనలు నిర్లక్ష్యం చేయలేమని, కాబట్టి తెలంగాణను 1961 వరకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని పేర్కొంది. 1961లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే తెలంగాణ ఎమ్మెల్యేల్లో 2/3 వ వంతు ఎమ్మెల్యేలు విశాలాంధ్రకు సుమఖత తెలిపితే విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చు లేకపోతే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాలని ఫజల్​ అలీ పేర్కొన్నారు. ఈ నివేదిక విశాలాంధ్రను కోరుకొనే వారికి ఆందోళనకు గురిచేసింది. కాంగ్రెస్​ అధిష్ఠానం ఆదేశం మేరకు బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ ప్రజల భయాందోళనలను తొలగించడానికి ప్రయత్నించాడు. దీని ఫలితమే పెద్ద మనుషుల ఒప్పందం. ఇందులో తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు.  ప్రెసిడెన్షియల్​ ఆర్డర్​ ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు వెలువడ్డాయి. 

కమిటీ కూర్పు

చైర్మన్​, డిప్యూటీ చైర్మన్​, 9 మంది సభ్యులు ( తెలంగాణలోని 9 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ తొమ్మిది మందిని ఆయా జిల్లాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు) ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు లేదా పార్లమెంట్​ సభ్యులు( వీరిని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కలిసి ఎన్నకుంటారు). ఐదుగురు సభ్యులు(శాసనసభకు బయటివారై ఉండాలి). ఈ మండలిలో తెలంగాణ ప్రాంత మంత్రులందరూ సభ్యులుగా ఉండాలి. ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకు చెందినవారైతే వారు తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలిలోని ఇతర కేబినెట్​ మంత్రులు ఆహ్వానితులుగా ఉండవచ్చు. తెలంగాణ ప్రాంతీయ మండలికి నివేదించిన బిల్లులను పూర్తిగా చర్చించడం కోసం రెండు రకాల ఉపసంఘాలు ఉంటాయి. 
1. స్థాయీ ఉపసంఘాలు 
2. తాత్కాలిక ఉపసంఘాలు. 

ఉప సంఘాలు

బిల్లును ప్రతిపాదించిన ఆయా శాఖాల మంత్రులే ఉప సంఘాల ఎక్స్​అఫిషియో సభ్యులుగా ఉంటారు. సాధారణంగా ఉపసంఘంలో 9 మంది సభ్యులు ఉంటారు. ఉపసంఘం చర్చించి సమర్పించిన నివేదికను తెలంగాణ ప్రాంతీయ సంఘం మళ్లీ చర్చించి దాన్ని శాసనసభకు పంపుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని తెలంగాణ ప్రజలవాణిగా పేర్కొంటారు. ఈ మండలి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల విస్తరణకు తన నియమనిబంధనల్లో మూడు ఉపసంఘాలను వ్యవస్థీకరించింది. 

1. స్థానిక పాలన, ప్రజా ఆరోగ్య సంబంధిత విషయాలు
2. విద్యా విషయాలు
3. అభివృద్ధి విషయాలు

ప్రతి ఒక ఉప సంఘంలో 9 మంది సభ్యులు ఉంటారు. ప్రాంతీయ సంఘం నుంచే ఉపసంఘాలకు సభ్యులను ఎన్నుకుంటారు. మంత్రులు సభ్యులుగా ఉండరాదు. వివిధ పార్టీలు, గ్రూపులకు చెందినవారు ఉపసంఘాల్లో సభ్యులుగా నామినేట్​ అయ్యే అవకావం ఉంటుంది. ఈ మూడు ఉపసంఘాలే కాకుండా అవసరమైనప్పుడు తెలంగాణ ప్రాంతీయ సంఘం అడ్​హక్​ ఉపసంఘాలనూ ఏర్పాటు చేస్తుంది. ఉపసంఘంలోని ఒక సభ్యున్ని ఉపసంఘం చైర్మన్ పదవికి నామినేట్​ చేస్తారు. చైర్మన్​ పదవీకాలం 5 సంవత్సరాలు. ఈ ఉపసంఘం సమావేశాలకు కోరం నలుగురు సభ్యులు. ఏదైనా విషయంలో సభ్యులు సమానంగా ఓటు వేస్తే చైర్మన్​కు కాస్టింగ్​ ఓటు ఉంటుంది. ప్రభుత్వ అధికారులను తమ ముందు హాజరు కావాలని పిలిచే హక్కు కూడా ఉపసంఘాలకు ఉంటుంది. 

విధులు 

తెలంగాణ ప్రాంతీయ సంఘం చైర్మన్ సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర శాసనసభ రూపొందించిన సాధారణ అభివృద్ధి ప్రణాళిక చట్టం పరిధిలో అభివృద్ధి సంస్థలు, జిల్లా బోర్డులు, జిల్లాల సంస్థలకు సంక్రమించే రాజ్యాంగబద్ధ అధికారాలను పరిశీలిస్తుంది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక ఆసుపత్రులు, వైద్యశాలలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. ప్రాథమిక, మాధ్యమిక విద్య, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, మద్యపాన నిషేధం, వ్యవసాయ భూముల విక్రయాన్ని నియంత్రిస్తుంది. కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, సహకార సంఘాలు, మార్కెట్లు, సంతల పనితీరును పరిశీలిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చేపట్టేందుకు ఈ ప్రాంతీయ కమిటీ అధికార పరిధి ఉంటుంది. మనీ బిల్లు కానీ తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేసే ప్రతి బిల్లు, శాసనసభ ఆమోదించే క్రమంలో ప్రాంతీయ కమిటీకి తప్పక నివేదించాలి. ప్రాంతీయ కమిటీకి నివేదించిన బిల్లు అందులో తెలంగాణ ప్రాంతానికి అన్వయించిన అంశాలను శాసనసభ ఆమోదం తర్వాత తప్పకుండా అదేవిధంగా అమలు చేయాలి .

పనితీరు 

తెలంగాణ మిగులు నిధుల వినియోగానికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ప్రణాళికలను రూపొందించింది. 1961 వరకు సమకూరిన మిగులు నిధులను 5, 6 సంవత్సరాల వ్యవధిలో ఖర్చుచేయాలని ప్రాంతీయ సంఘం తీర్మానించింది. దీని ఫలితంగా 1961, 1962 సంవత్సరాల్లో తెలంగాణ మిగులు నిధుల వినియోగం కోసం వివిధ పథకాలను రూపొందించి అమలు చేశారు. ఈ పథకాలను తెలంగాణ రీజినల్​ కమిటీ పథకాలుగా వ్యవహరించారు. ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాల నియమాలకు తెలంగాణ ప్రాంతీయ మండలి సరళీకరణ నియమాలను ప్రతిపాదించగా ప్రభుత్వం అమలు చేసింది. విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశాల విషయంలో సిఫార్సులను రూపొందించింది. ప్రజారోగ్యం విషయంలో హైదరాబాద్​ నగరం వెలుపల తెలంగాణ ప్రాంతంలో గల సౌకర్యాలను కూలంకషంగా అధ్యయనం చేసి హైదరాబాద్​ నగరంలోని అమీర్​పేటలో గల ప్రకృతి చికిత్సా విద్యాలయానికి గ్రాంటును మంజూరు చేసింది. సర్వీసుల విషయంలో ప్రాంతీయ మండలికి అధికారాలు ఉన్నాయని అధ్యక్షుడు ప్రకటించినా అలాంటి అధికారం లేదని ప్రకటించింది. ప్రజలను కానీ ప్రతినిధులను కానీ సమావేశాల్లో చర్చలు జరుగుతున్నప్పుడు హాజరుకావడానికి అనుమతించలేదు. ప్రాంతీయ సంఘం ఉపసంఘాలు సమర్పించిన నివేదికలు శాసనసభ్యులకే అందుబాటులో ఉండి, వాటి ఉపయోగం పరిమితం అయిపోయింది. 1956 ఫిబ్రవరి 20‌‌ పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న నాయకులు ఆంధ్ర నాయకులు  
1. బెజవాడ గోపాల్​రెడ్డి (ముఖ్యమంత్రి)
2. నీలం సంజీవరెడ్డి (ఉపముఖ్యమంత్రి)
3. అల్లూరి సత్యనారాయణరాజు    
4. సర్దార్​ గౌతు లచ్చన్న (మంత్రి)

తెలంగాణ నాయకులు
5. బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి)
6. కె.వి.రంగారెడ్డి (మంత్రి)
7. మర్రిచెన్నారెడ్డి (మంత్రి)
8. జె.వి.నర్సింగరావు 
(హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్ అధ్యక్షులు) 

1. ప్రెసిడెన్షియల్​ ఆర్డర్​ ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు ఏ సంవత్స రంలో ఆదేశాలు జారీ అయ్యాయి? (3)
1) 1956 ఫిబ్రవరి    2) 1957 ఫిబ్రవరి
3) 1958 ఫిబ్రవరి    4) 1959 ఫిబ్రవరి 
2. తెలంగాణ ప్రాంతీయ సంఘం కోరం? (2) 
1) 1/2వ వంతు సభ్యులు    
2) 1/3వ వంతు సభ్యులు
3) 1/4వ వంతు సభ్యులు    4) కోరం లేదు
3. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 
మొదటి చైర్మన్​?  (1) 
1) కె. అచ్యుతరెడ్డి   2) టి.హయగ్రీవాచారి
3) జె.చొక్కారావు   4) కోదాటి రాజమల్లు 
4. తెలంగాణ ప్రాంతీయ సంఘం 
చివరి అధ్యక్షులు? (4)
1) కె. అచ్యుతరెడ్డి    2) టి.హయగ్రీవాచారి
3) జె.చొక్కారావు 4) కోదాటి రాజమల్లు 
5. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 
మొదటి ఉపాధ్యక్షులు? (1)
1) మసుమా బేగం 2) టి.రంగారెడ్డి
3) కోదాటి రాజమల్లు 
4) సయ్యద్​ రహమత్​ అలీ