తెలంగాణ జానపద సంస్కృతి నకాషీ చిత్రాల్లో

తెలంగాణ జానపద సంస్కృతి నకాషీ చిత్రాల్లో

తెలంగాణ జాబ్స్ స్పెషల్: 

చేర్యాల​ స్క్రోల్​ పెయింటింగ్​ అనేది నకాషీ కళకు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తారు. ఈ పటాలు పురాణ గాథలు, ఇతిహాసాలను వివరిస్తాయి. చైనాలో స్క్రోల్​ పెయింటింగ్స్​ రాచకరికపు ఆచార వ్యవహారాల్లో భాగంగా ఉండేవి. మన దేశంలో ఈ కళ గ్రామీణుల జీవితాలకే పరిమితమై జానపద కళగా వెలుగొందింది. తెలంగాణలో నకాషీ వారసత్వం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఒకప్పుడు నకాషీ కళాకారులు ఎక్కువగా కరీంనగర్​లో ఉండేవారు. ప్రస్తుతం వేములవాడ తదితర ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 1942లో ఒకరిద్దరు కళాకారులు సిద్దిపేట​ జిల్లా చేర్యాల​కు వలస వచ్చి తమ కుటుంబ సభ్యులకు నకాషీ కళను నేర్పించారు. ఆ విధంగా కొన్నేండ్ల తర్వాత నకాషీ పట చిత్రాలు కాస్తా చేర్యాల పెయింటింగ్స్​గా మారిపోయాయి. నకాషీ కళలో సహజసిద్ధ రంగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొదట ఖాదీ కన్వాస్​ను పెయింటింగ్​ కోసం సిద్ధం చేసుకుంటారు. సహజ రంగులను ఉపయోగించి పెయింటింగ్స్​ వేస్తారు. బురపెడ్డల మట్టి, కోడిగుడ్డు సొన, బంకమట్టిని కలిపి బొమ్మను తయారు చేస్తారు. ఇది ఆరడానికి రెండ్రోజులు పడుతుంది. దానికి చింత అంబలితో బట్టను అతికించి రెండుసార్లు ఆ బట్టపై సున్నం అద్దుతారు. ఆ తర్వాత వాటర్​ కలర్స్​ను వేస్తారు. ఈ ప్రక్రియల అనంతరం అద్భుత కళాఖండాలుగా రూపొందుతాయి.

నకాషీ చిత్రాలు 
నకాషీ అనేది ఉర్దూ పదం. తెలంగాణ జానపద సంస్కృతి నకాషీ చిత్రాల్లో కనిపిస్తుంది. దీపావళి, కార్తీక మాసంలో కేదారీశ్వర వ్రతం చేయడానికి ఇండ్లలో తెల్లటి సున్నపు గోడలపై జాజురంగుతో పొప్పెడ అనే చిత్రాలను గీసేవారు. నకాషీ పటాలు కుల పురాణాలను అధికంగా వివరిస్తాయి.వివిధ కులాల ఆవిర్భావం, గొప్పదనాన్ని వివరించే కుల పురాణాలను ఆయా కుల ఆశ్రిత కులాల వారు చెబుతారు. 

బిద్రి వస్తువులు 
భారతీయ మెటల్​ క్యాస్టింగ్​ అత్యుత్తమ సంప్రదాయంలో బిద్రి ఒకటి. హైదరాబాద్​కు సుమారుగా 145 కి.మీ.ల దూరంలో బహమనీ, బీదిరి సామ్రాజ్యాల రాజధానిగా ఉన్న బీదర్​ నగరంలో మొదట ఈ కళ రూపుదిద్దుకుంది. అత్యున్నత స్థాయి హస్తకళ నైపుణ్యం బిద్రి కళలో కనిపిస్తుంది. ఈ కళ గురించి ప్రస్తావన 17వ శతాబ్ది కాలపు రచనల్లో కనిపిస్తుంది. పర్షియన్​ హిస్టరీ ఆఫ్​ ఇండియా చహర్​ గుల్​షాన్​లో దీని ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ కళకు బిద్రి అనే పేరు వచ్చింది. బిద్ర (బీదర్​ – బిద్రి) కళ ఇరాన్​ నుంచి హైదరాబాద్​  సంస్థానానికి వచ్చింది. 17వ శతాబ్దం అనంతరం ఈ కళ ఉన్నతస్థాయికి చేరుకొని దక్కన్​ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించింది. ఉత్తర భారతదేశంలోని లక్నో, పుణెలకు చేరింది. 19వ శతాబ్దంలో ముషీరాబాద్​కు వచ్చింది. హైదరాబాద్​ నగరంలో గన్​ మెటల్(కాపర్​ అండ్​ జింక్​)తో తయారు చేసిన కళాఖండాల మీద నల్లని రంగువేసి దానిపై వెండి లేదా బంగారు రంగులతో అద్భుతమైన డిజైన్లు వేస్తారు. ఈ కళకు సంబంధించిన వస్తువు ఉత్పత్తిలో కీలక దశలు 1. క్యాస్టింగ్​ 2. పాలిషింగ్​ 3. ఎన్​గ్రేవింగ్​ 4. ఇన్​లేయింగ్​ 5. లోహ మిశ్రాన్ని నలుపు చేయడం. బీదర్ పోర్ట్​లో లభ్యమయ్యే ఒక రకం మట్టిని నీటిలో కలిపి లోహ మిశ్రమాన్ని నలుపు చేయడానికి ఉపయోగిస్తారు. హుక్కా, ఉగాల్దాన్, సైలాబ్చి(వాష్​బేషిన్స్​), మహిళలు ఉపయోగించే పాన్​దాన్​, నగర్​దాన్​, చాన్​గేర్​, ముఖాబా, డిబియా మొదలైనవి రూపొందిస్తారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఫ్రెంచ్​ ప్రభావం అధికంగా ఉండేది. హైదరాబాద్​లోని సాలార్ జంగ్​ మ్యూజియంలో పలు రకాల బిద్రి కళాఖండాలను చూడవచ్చు. 

ఆసియా రుమాల్​
నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలో ఇక్కాట్అనే నేతను వీటిని తయారు చేస్తారు. సంక్లిష్టమైన రేఖా చిత్రాలు, మార్జిలను వీటిపై వినియోగిస్తారు. దారాన్ని తైలంలో ముంచి ఆరవేస్తారు. వీటిని గొర్రె పేడతో నింపిన నీటిలో ఒక రాత్రి ఉంచి, మరునాడు ఆరబెడతారు. నాలుగు రోజులపాటు ఈ విధంగా చేస్తారు. తర్వాత టై డై ప్రక్రియలో రంగులను అద్ది చిత్రాలు గీస్తారు. రుమాల్​ను సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించుకునేందుకు తలపాగాగా ఉపయోగిస్తారు.

సిల్వర్​ ఫిలిగ్రీ 
ఈ కళకు కరీంనగర్​ జిల్లా పెట్టింది పేరు. వెండి , బంగారం తీగలతో అల్లకం పద్ధతిలో తయారు చేసే వస్తువులను సిల్వర్​ ఫిలిగ్రీ అని పిలుస్తారు. లోహాలను తీగలుగా మార్పుచేసి వాటికి అద్భుతరీతిలో అందమైన కళాత్మక రూపం ఇవ్వడమే ఫిలిగ్రీ. 19వ శతాబ్దంలో కరీంగనర్ జిల్లా ఎలగండల పట్టణానికి చెందిన హస్తకళాకారులు ఈ నైపుణ్యాన్ని అలవర్చుకొన్నారని... ఆ తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో కరీంనగర్​కు చేరుకుందని చరిత్రకారుల​ అభిప్రాయం. ఎలగందుల ప్రాంతానికి చెందిన కండ్ల రామయ్య అనే స్వర్ణకారుడు ఈ కళను నేర్చుకున్నాడు. ఫిలిగ్రీ అనే పదం ఆంగ్ల పదం ఫిలిగ్రీన్​ అనే లాటిన్​ పదం నుంచి వచ్చింది. లాటిన్​ ఫిలమ్​ అంటే త్రెడ్​ (సన్నని తీగ పోగు). గ్రాణమ్​ అంటే ధాన్యపు గింజ తరహాలో చిన్న పూస. ఈ కళ మన రాష్ట్రంలోని కరీంనగర్​తోపాటు ఒడిశాలోని కటక్​, కశ్మీర్​లోని శ్రీనగర్​, తమిళనాడులోని తిరుచిరాపల్లి, త్రిపురలోని అగర్తల, రాజస్తాన్​లోని కోటా, కేరళలోని తిరువనంతపురంలో అభివృద్ధి చెందింది. ఈ కళలో రూపుదిద్దుకొనే ఏ రెండు వస్తువులైనా ఒకే రకంగా ఉండవు. ప్రతి వస్తువు కూడా మాస్టర్ పీస్ గా ఉంటుంది. అందుకే ఇది నమ్మశక్యం కాని కళాత్మక నైపుణ్యంగా పేరుపొందింది. ఫిలిగ్రీని స్థానిక జాలి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్​ విద్యాసాగర్​ ప్రయత్నం వల్ల  సిల్వర్​ ఫిలిగ్రీ కళ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ కళకు జియోగ్రాఫికల్​ ఇండికేషన్​(జీఐ) గుర్తింపు లభించింది. సిల్వర్​ ఫిలిగ్రీ వస్తువుల్లో పాందానాలు, అత్తర్​దానాలు, హుక్కాలు, ప్లేట్లు మొదలైన వస్తువులు ఉంటాయి. 

డోక్రా మెటల్​ క్రాఫ్ట్స్​
డోక్రా అనేది నాన్​ ఫెర్రస్​ మెటల్​ కాస్టింగ్​తో లాస్ఠ్ వాక్స్​ కాస్టింగ్​ టెక్నిక్​లతో కూడిన హస్తకళ. దేశంలో ఈ కళ నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుంచి అభివృద్ధి చెంది నేటికీ కొనసాగుతోంది. ఈ కళకు సంబంధించి ప్రఖ్యాతి చెందిన బొమ్మ డ్యాన్సింగ్​ గర్ల్​ ఆఫ్​ మొహంజొదారో. బస్తర్​ డోక్రా బొమ్మలను ఎక్కువగా ఇత్తడితో తయారు చేస్తారు. పశ్చిమబెంగాల్​లోని సంప్రదాయ లోహ తయారీదారులైన డోక్రా దమర్​ అనే తెగ పేరు మీదుగా డోక్రా అనే పదం ఉద్భవించింది. బెల్​మెటల్​ ఉపయోగించి ఆదిలాబాద్​ గిరిజన ప్రాంతంలోని గిరిజనులు అతి సున్నితమైన, సహజవంతమైన కళాఖండాలను తయారు చేస్తారు. జానపద డిజైన్లు, నెమళ్లు, ఏనుగులు, గుర్రాలు, దీపారాధనలు వంటివి తయారు చేస్తారు. వీటిలో ఎక్కడా ఒక్క అతుకు కూడా ఉండదు. పశ్చిమబెంగాల్​లోని శాంతినికేతన్​ ప్రాంతంలో తయారు చేసే బస్తర్ డోక్రా బొమ్మలకు  ప్రసిద్ధి.