తెలంగాణ జాబ్స్ స్పెషల్

తెలంగాణ జాబ్స్ స్పెషల్

ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న సాంఘిక దురాచారం జోగినీ వ్యవస్థ. ఇది వీరశైవ సంప్రదాయం. జోగినీ వ్యవస్థలో బాలికలను పురుష దేవతలకు అర్పిస్తారు. యుక్త వయసు రాగానే జోగినిగా మారుతుంది. వీరశైవ సంప్రదాయ కులాలను ఆశ్రయించి జోగినులుగా బతుకులు వెళ్లదీస్తారు. వీరి జీవన విధానంలో లైంగిక స్వేచ్ఛ, స్వతంత్ర జీవనం భాగం. కుటుంబ వ్యవస్థలో భాగస్వామ్యం నిషిద్ధం. వీరశైవ మత సంప్రదాయం నిర్దేశించిన క్రతువులను ఆచరిస్తూ అవివాహితగా కొనసాగాలి. వీరిని ఎల్లమ్మ, పార్వతి అనే పేర్లతో పిలుస్తారు. జోగినిని దైవానికి ప్రతినిధిగా, పార్వతి అవతారంగా భావిస్తారు. 

బౌద్ధ, జైన, వీరశైవ, వైష్ణవ మతాల్లో  జోగిని, దేవదాసీ వ్యవస్థలు ఉనికిలో ఉన్నాయి. రాచరిక వ్యవస్థల్లో ఏ మతం ఉనికిలో ఉంటే వాటికి చెందిన సంప్రదాయాలు, విధానాలు, జీవనరీతులు గౌరవం పొందేవి. 7, 8, 9 శతాబ్దాల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో రాష్ట్రకూట, చాళుక్య రాజ వంశాల కాలంలో జైనంలోని యోగి ఆచారం పేరుతో జోగిని సంప్రదాయం కొనసాగింది. ఆ తర్వాత 9 నుంచి 13వ శతాబ్దం వరకు కాకతీయులు, హోయసలలు పాలనా కాలంలో వీరశైవం ప్రాబల్యంలోకి రావడంతో అదే ఆచారం జోగిని వ్యవస్థగా స్థిరపడింది. మధ్యయుగాల నుంచి 1857లో ఈస్టిండియా కంపెనీ పాలన అంతమయ్యే వరకు కొనసాగింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు జోగిని, దేవదాసీ వ్యవస్థలపై నిషేధం విధించారు. తెలంగాణలో జోగినిల సంస్కరణల కోసం పూనుకున్న తొలి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఆయన చేపట్టిన కార్యక్రమాలతో నిజాం ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేధిస్తూ 1934లో చట్టం చేసింది.  

జోగినీ వ్యవస్థ లేని ఏకైక తెలంగాణ జిల్లా? (సి)
ఎ. కరీంనగర్    బి. ఆదిలాబాద్
సి. ఖమ్మం        డి. హైదరాబాద్

జోగిని సమర్పణ

గ్రామంలో అంటువ్యాధులు, కరువు కాటకాలు సంభవించినప్పుడు ఎంపిక చేసిన కుటుంబంలోని బాలికలను జోగినిగా సమర్పించేవారు. ఇది వంశపారంపర్యంగా కొనసాగేది. ఒకవేళ ఆ కుటుంబంలో బాలికలు లేకపోతే గ్రామ పెద్దలు కలసి మరో కుటుంబంలోని అమ్మాయిని ఎంపిక చేసి జోగినిగా మారుస్తారు. ఇందుకోసం దళిత లేదా వెనకబడిన కులాలైన రజక, దొమ్మర, మాదిగ మొదలైన కులాల నుంచి బాలికలను ఎంపిక చేస్తారు. ఆరు నెలల పాప నుంచి 10 లేదా 12 ఏండ్ల బాలిక వరకు జోగినిగా సమర్పించవచ్చు. తల్లిదండ్రులు అంగీకరించకపోయినా కుల పెద్దలు వేరే జోగినితో పూనకం వచ్చినట్లు చేయించి గ్రామం నాశనం అవుతుందని బెదిరించి వారు కోరుకున్న అమ్మాయిలను జోగినులుగా మార్చేవారు. 

ఊరి పండుగ

ఊరిలో పశువులు చనిపోయినాఅంటురోగాలు ప్రబలినా చిల్లర పైసలు, పసుపు, కుంకుమ బియ్యంతో ముడుపు కడతారు. వర్షాకాలం ఆరంభంలో ఊరి పండుగను నిర్వహిస్తారు. సప్తమాతృకల స్వరూపాలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మల సోదరుడు, సేవకుడు పోతురాజు. ఊర పండుగ సమయంలో పోతురాజు ప్రాణంతో ఉన్న మేక పిల్లను గానీ కోడిపిల్లను గానీ నోటితో కొరికి మెడను వేరు చేయడాన్నే గావు పట్టడం అంటారు. జోగిని వివాహంలో పోతురాజు ప్రధాన పాత్ర వహిస్తాడు. 

జోగుపట్టం

బాలికను జోగినిగా మార్చే ప్రక్రియనే జోగుపట్టం అంటారు. జోగినిగా మార్చడానికి ఒకరోజు ముందు కుల పెద్దల సమక్షంలో ఉత్సవం చేస్తారు. జోగినిగా మార్చే అమ్మాయిని పెళ్లి కూతురులా అలంకరించి, శాస్త్రోక్తంగా వివాహం చేస్తారు. పోతురాజు గానీ కులపెద్ద గానీ మేనమామ గానీ వృద్ధ జోగిని గానీ మంగళసూత్ర ధారణ చేస్తారు. అప్పటి నుంచి ఆమె నిత్య సుమంగళి. సాధారణ వివాహం చేసుకోవడం కుదరదు.  

రంగం 

జోగిని భవిష్యత్తు చెప్పడాన్నిరంగం అంటా రు. ఆ రోజు కొత్తకుండను భూమిలో పాతిపెడతారు. జోగిని దాని పైకి ఎక్కి, దేవతాస్తుతి చేసి కులపెద్ద అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఏ దేవత గ్రామంపై అలిగిందో దేవతలకు మొక్కులు ఎలా తీర్చాలో చెబుతుంది. రంగం ఎక్కే జోగినిని కొల్లమ్మ అంటారు. 

తెలంగాణలో జోగినీ వ్యవస్థపై సంపూర్ణ అధ్యయనం చేసింది?(బి)

ఎ. వకులాభరణం లలిత    బి. హేమలతా లవణం
సి. భాగ్యరెడ్డి వర్మ    డి. గ్రేస్ నిర్మల

ఆంధ్రప్రదేశ్ దేవదాసీ బిల్లు - 1988

ఈ చట్టం 1988 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చింది. హిందూ ఆలయాలు గానీ మతసంబంధ వస్తువులకు గానీ దేవాలయాలకు గానీ మత సంస్థలకు గానీ అమ్మాయిలను అంకితం చేయడం నిషేధం. బసివి, జోగిని, పార్వతి, మాతమ్మ, తాయమ్మ మొదలైన ఏ పేరుతో అమ్మాయి సమర్పణ జరిగినా ఈ చట్టం వర్తిస్తుంది. జోగినులతో శవ నృత్యాలు, ఊర పండుగలు, మత కార్యక్రమాల్లో నృత్యాలు చేయించడం చట్టబద్ధం కాదు. సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నా, ప్రోత్సహించినా రెండేండ్లకు తగ్గకుండా గరిష్టంగా మూడేండ్లు జైలుశిక్ష పడుతుంది. 

రఘునాథరావు కమిషన్

జోగినులు, వారి సమస్యలపై 1991–-92లో రాష్ట్ర ప్రభుత్వం వి.రఘునాథరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ దేవదాసీ బిల్లు–1988 సవరణలు చేసి, జోగినులుగా పిలువబడేవారు చెప్పిన ఫిర్యాదులను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలి. 

చెల్లి నిలయం 

నిసా, సంస్కార్ సంస్థలు నిజామాబాద్ జిల్లా వర్ని గ్రామాన్ని ఎంపిక చేసి చెల్లి నిలయం పేరుతో సంస్థను స్థాపించి జోగినుల కోసం పనిచేయడం ప్రారంభించారు. చెల్లి నిలయంలో జోగినులందరూ అక్కాచెల్లెళ్లు గా భావించబడుతారు. జోగినుల రక్షణ, వారి పిల్లల వసతి, శిక్షణా కేంద్రం నిర్మాణానికి చెల్లి నిలయానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ 
ఐదెకరాలు కేటాయించారు. 

శవయాత్ర నృత్యాలు అంటే? (డి) 
ఎ. భూస్వాములు మరణించినప్పుడు పోతురాజులు చేసే నృత్యాలు
బి. భూస్వాములు మరణించినప్పుడు జోగినులు చేసే నృత్యాలు
సి. పోతురాజులు మరణించినప్పుడు జోగినులు చేసే నృత్యాలు
డి. పైవన్నీ

  •  జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం సంస్థాగతంగా కృషి చేసిన మొదటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. 1922లో అఖిల భారత ఆది హిందూ మహాసభ  సమావేశంలో బాలికలను దేవతకు అర్పించరాదన్న  ప్రధాన తీర్మానం చేశారు. 
  •  ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మొదటి వ్యక్తి ఐఏఎస్ అప్పారావు. ఆయన 1980లో నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌‌ఆర్ శంకరన్‌‌కు లేఖ రాశారు.  
  • 1985లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌‌గా వచ్చిన ఆశామూర్తి జోగినులకు పునరావాసం కల్పించడం కోసం కృషి చేశారు. 
  • ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఫర్ సోషల్ యాక్షన్(నిసా)ను  ఏపీ గవర్నర్ కుముద్‌‌బెన్ జోషి ప్రారంభించారు. ఈ సంస్థ ఢిల్లీలో సాంఘిక సంస్కరణ సమావేశం నిర్వహించారు. 
  •  జోగినిల దురవస్థ చూసి వాళ్ల జీవితాలను బాగు చేయడం కోసం హేమలత, లవణం కృషి చేశారు. ఇందుకోసం 1974లో విజయవాడలో సంస్కార్ సంస్థను స్థాపించారు. 
  •  నిజామబాద్‌‌లో బి.సుందరం అనే వ్యక్తి జోగినులకు కొత్త జీవితం అనే వ్యాసం రాశాడు. 
  •  జోగినుల మానసిక ప్రవర్తన కోసం, భావదస్యతను తగ్గించడం కోసం అమ్మ సంస్థ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  
  • 1993లో గ్రేస్ నిర్మల, నీలయ్య ఆశ్రయ్ సంస్థను స్థాపించారు. ఎంతో మంది జోగినులుగా మారకుండా అడ్డుకున్నారు. ఈ సంస్థ జోగినుల పునర్వివాహాలు అవగాహన కల్పిస్తోంది. దళిత అనే పత్రికను నడుపుతూ జోగినులను చైతన్యవంతం చేస్తోంది.