- కర్నాటక, తమిళనాడు, కేరళలో నోటిఫయబుల్ డిసీజ్‌గా క్యాన్సర్
- ప్రైవేట్, సర్కార్ దవాఖాన్ల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టులు
- మన దగ్గర మాత్రం పత్తాలేని రిజిస్ట్రీ.. రోగుల సంఖ్యపై అయోమయం
- లెక్క పక్కాగా ఉంటేనే నివారణ చర్యలు సాధ్యమంటున్న నిపుణులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా ఏకంగా 55 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2030 నాటికి ఏడాదికి 65 వేల కేసులు కూడా దాటే ప్రమాదం ఉంది. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఉన్నా.. రాష్ట్రంలో అసలు క్యాన్సర్ తీవ్రత ఎంత? ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్ ఎక్కువ వస్తున్నది? అన్నదానిపై స్పష్టమైన లెక్కలు మాత్రం ప్రభుత్వం దగ్గర లేవు.
దీనికి ప్రధాన కారణం క్యాన్సర్ ను నోటిఫయబుల్ డిసీజ్ అంటే తప్పనిసరిగా నమోదు చేయాల్సిన వ్యాధిగా ప్రకటించకపోవడమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించి, కాంప్రహెన్సివ్ స్టేట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని ఎక్స్ పర్ట్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల వ్యాధి నియంత్రణకు, పాలసీల రూపకల్పనకు వీలవుతుందని చెప్తున్నారు.
లక్షల్లో క్యాన్సర్ పేషంట్లు
రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.7 లక్షల నుంచి 1.8 లక్షల వరకు యాక్టివ్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు అంచనా. ఇదే తీరు కొనసాగితే 2030 నాటికి ఏటా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్యే 65 వేలు దాటే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నాన్ -కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) వల్ల 63% మరణాలు సంభవిస్తుండగా, అందులో క్యాన్సర్ వాటా 9 శాతంగా ఉంది.
బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి ప్రతి లక్ష కేసుల్లో 54 మన హైదరాబాద్ నుంచే నమోదవుతున్నట్లు ఐసీఎంఆర్ లెక్కలు చెబుతున్నాయి. అందుకే పక్కా డేటా ఉంటేనే.. నివారణ చర్యలు చేపట్టగలమని, వనరులను సరిగ్గా వినియోగించుకోగలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టీబీ (క్షయ) వ్యాధికి ఉన్నట్టుగానే క్యాన్సర్ కు కూడా ప్రత్యేక వ్యవస్థను తేవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.
పక్క రాష్ట్రాలు ఎప్పుడో అలర్ట్
దేశంలో ఇప్పటికే కర్నాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 8 రాష్ట్రాలు క్యాన్సర్ ను నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించి, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అంటే.. ఏ చిన్న ల్యాబ్ లోనైనా, పెద్ద హాస్పిటల్ లోనైనా ఒకరికి క్యాన్సర్ అని తేలితే.. ఆ సమాచారం ప్రభుత్వానికి చేరాల్సిందే. దీనివల్ల అక్కడ బాధితుల సంఖ్యపై పక్కా క్లారిటీ ఉంటున్నది.
రిజిస్ట్రీ ఆధారంగా జిల్లాలవారీగా డేటా తీసి.. ఎక్కడ ఎక్కువ కేసులు వస్తున్నాయో గుర్తించి అక్కడ వైద్య సదుపాయాలు పెంచుకుంటున్నారు. మన దగ్గర మాత్రం గతంలో రిజిస్ట్రీకి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించినా, ఆ ఆలోచన కాగితాలకే పరిమితమైంది.
నివారణకు ట్రాకింగ్ కీలకం
దేశంలో టీబీ (క్షయ) వ్యాధిని కంట్రోల్ చేయడానికి నిక్షయ్ పోర్టల్ ఉంది. సర్కారు దవాఖాన్లలోనే కాదు.. ప్రైవేట్ హాస్పిటల్ లో టీబీ కేసు నమోదైనా వెంటనే ప్రభుత్వానికి తెలిసిపోతుంది. పేషెంట్లకు మందులతో పాటు, పెన్షన్ డబ్బులు కూడా అందుతున్నాయి. టీబీ నివారణలో ట్రాకింగ్ వ్యవస్థ కీలకంగా పని చేస్తున్నది. ‘క్యాన్సర్ విషయంలోనూ ఇదే పద్ధతి తేవాలి. ప్రతి పేషెంట్ కు ఒక ఐడీ ఇచ్చి, ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నా, ప్రభుత్వ దవాఖానలో ఉన్నా ట్రాక్ చేయాలి.
దీనివల్ల ఏ జిల్లాలో ఏ క్యాన్సర్ ఎక్కువ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ స్పెషల్ క్యాంపులు పెట్టొచ్చు. సరైన డేటా ఉంటేనే స్క్రీనింగ్, ఎర్లీ డయాగ్నసిస్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయ్యొచ్చు’ అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సర్కార్ కు చేరని.. ప్రైవేట్ లెక్కలు
దేశంలోనే క్యాన్సర్‌కు అత్యుత్తమ చికిత్సను అందించే కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. దేశంలోని నలుమూలల నుంచి పేషెంట్లు ఇక్కడికి వస్తుంటారు. కానీ, ఈ హాస్పిటల్స్ లో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల వివరాలు మాత్రం ప్రభుత్వానికి చేరడం లేదు. రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య ఎంతంటే.. అంచనా వేయడమే తప్ప కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎంఎన్జే, నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రమే తమ దగ్గరకు వచ్చే కేసుల వివరాలను నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ)కు పంపిస్తున్నాయి.
ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లలో నిర్ధారణ అవుతున్న వేల కేసుల సమాచారం మాత్రం ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు. క్యాన్సర్ అంటువ్యాధి కాకపోవడంతో ఇన్నాళ్లు దీనిని నోటిఫయబుల్ జాబితాలో చేర్చలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అత్యవసరమని డాక్టర్లు అంటున్నారు.
