
- ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ
- రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అవసరం ఉన్నవారి ఇండ్ల వద్దకే ఇసుక సప్లయ్ చేస్తున్నామని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో https://sand.telangana.gov.in/ TGSandBazaarPortal/Masters/Home.aspx అనే ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రజలకు ఇసుకను హోమ్ డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలో వినియోగదారుడు తాను ఎంపిక చేసుకున్న ఇసుక రీచ్ నుంచి ఇసుకను కొనుగోలు చేయొచ్చన్నారు. ఒక టన్నుకు రూ.400 కాగా, 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే ప్రతి కిలోమీటర్‌కు రూ.3.75 చొప్పున, 200 కిలోమీటర్లలోపు ఉంటే ప్రతి కిలోమీటర్ కు రూ.4.25 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ఇసుక అక్రమ తరలింపునకు అవకాశం లేకుండా రీచ్‌ల నుంచి స్టాక్‌యార్డుకు చేరుకునే వాహనాలకు జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేశామని, ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్రమ రవాణా, తవ్వకాలతోపాటు వే బిల్స్ లేని వాహనాలను నియంత్రించే ఉద్దేశంతో హైదరాబాద్ శివారులో సాండ్ బజార్లకు శ్రీకారం చుట్టామని వివరించారు. అబ్దుల్లాపూర్‌మెట్, బోరంపేట్, వట్టినాగులపల్లి, ఆదిబట్లలో ఇసుక బజార్లను ప్రారంభించామన్నారు. గతంలో బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక ధర రూ.2,200 ల నుంచి-2,400 మధ్య ఉండేదని, అయితే.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు టన్ను ఇసుక ధర రూ.1,600ల నుంచి1,700కు దిగొచ్చిందని ప్రకటనలో వివరించారు.