- రాపోలు భాస్కర్
మెదక్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న 50 వేల మంది న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని సీనియర్ అడ్వకేట్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీలో ఉన్న రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు.
గురువారం మెదక్ జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ ఎన్నికలు ఏడున్నర సంవత్సరాలుగా జరగకపోవడం శోచనీయమన్నారు. 2026 జనవరి 31 లోగా ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.
కరోనా సమయంలో అడ్వకేట్లకు రూ.25 కోట్లు ఇప్పించామన్నారు. జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. న్యాయవాదుల సంక్షేమం, ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య బీమా పరిమితిని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇండ్లు లేదా స్థలాలు లేని, ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లు, ఇల్లు స్థలాలు ప్రభుత్వం కేటాయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, సీనియర్ న్యాయవాది కొప్పుల పోచయ్య, సుభాష్ గౌడ్, రవీందర్, జనార్దన్ రెడ్డి, రాఘవులు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
