కేసీఆర్ ఉండగా చుక్క నీటిని కూడా తరలించలేరు

కేసీఆర్ ఉండగా చుక్క నీటిని కూడా తరలించలేరు

హైద‌రాబాద్: మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జగన్ భావించడం అత్యాశనే అన్నారు. పులిచింతల ప్రాజెక్టుతో పాటు పోతిరెడ్డిపాడు విషయంలో ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు.. అప్పటి ఎమ్మెల్యేలు మద్దతునిచ్చారని.. కాంట్రాక్టులు కూడా తీసుకున్నారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటి తరలింపు జరగదని భావిస్తున్నాను అన్నారు.

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు జాతీయ విధానం లేదా.. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాగే వ్యవహరించారన్నారు. అవకాశవాదం కోసం.. తెలంగాణకు శాశ్వత ద్రోహం చేయాలని అనుకోవడం భావ్యం కాదన్నారు. రైతు సమస్యలను పార్టీలు రాజకీయం చేయటం సరికాదని.. ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని తెలిపారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్ని పార్టీలు ఏకమై ఉద్యమం చేయాలన్న‌ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.. ప్రతిపక్షాలు రెండు గంటల దీక్షతో ఉద్యమాలను అవమానిస్తున్నారన్నారు.