సాగర్​ కాల్వల కెపాసిటీలపై కేఆర్​ఎంబీకి తెలంగాణ లెటర్

సాగర్​ కాల్వల కెపాసిటీలపై కేఆర్​ఎంబీకి తెలంగాణ లెటర్
  • సాగర్​ కాల్వల కెపాసిటీల్లో ఎక్కువ, తక్కువలా?
  • నీటి తరలింపుల్లో తేడాలను సరిచేయాలె.. కేఆర్​ఎంబీకి తెలంగాణ లెటర్

హైదరాబాద్​, వెలుగు: నాగార్జునసాగర్​ కుడి, ఎడమకాల్వల హెడ్​రెగ్యులేటర్ల నుంచి నీటిని తరలించడంలో ఉన్న తేడాల్ని సరిచేయాల్సిందిగా కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సాగర్​లో 510 అడుగుల వద్ద నీళ్లుంటే ఎడమ కాల్వ నుంచి కేవలం 7,889 క్యూసెక్కుల తరలింపుకే చాన్స్​ ఉంటుందని, అదే కుడి కాల్వ నుంచి 500 అడుగుల స్థాయిలోనూ 24,606 క్యూసెక్కులను తీసుకోవచ్చని బోర్డు చైర్మన్​ ఎస్పీ సింగ్​కు బుధవారం రాసిన లేఖలో ఇరిగేషన్​ ఈఎన్సీ మురళీధర్​ పేర్కొన్నారు. 1952లో ఆంధ్ర, హైదరాబాద్​ స్టేట్​లు చేసుకున్న ఒప్పందం ప్రకారం సాగర్​ కుడి, ఎడమ కాల్వల నుంచి నీటి విడుదల సమానంగా జరగాలని గుర్తు చేశారు. ఏపీతో కలిసి ఉన్నప్పుడు రెండు రెగ్యులేటర్ల నిర్మాణాల్లో అన్యాయం చేశారని, ఎక్కువ తక్కువలతో రెగ్యులేటర్లను కట్టారని పేర్కొన్నారు. ఈ విషయంలో బోర్డు వెంటనే జోక్యం చేసుకుని 510 అడుగుల వద్ద కూడా 11 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకునేలా ఎడమ కాల్వ రెగ్యులేటర్​ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కుడి కాల్వ కెపాసిటీనీ అదే లెవెల్​లో 11 వేల క్యూసెక్కులకు తగ్గించాలన్నారు. కుడి కాల్వ కింద ఉన్న ఆయకట్టుకు వేరే మార్గాల్లోనూ ఏపీ సర్కారు నీటిని తరలించుకునే అవకాశం ఉందని, కాబట్టి కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకునేందుకు అవకాశమివ్వాలని మురళీధర్​ కోరారు. ఇదే విషయంపై బ్రజేశ్​ ట్రిబ్యునల్​ ముందు వాదనలు వినిపిస్తున్నామన్నారు.