చరిత్రను తొక్కిపెట్టినోళ్లకు.. ప్రజలే బుద్ధిచెప్తరు

చరిత్రను తొక్కిపెట్టినోళ్లకు.. ప్రజలే బుద్ధిచెప్తరు
  • సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ వల్లే తెలంగాణకు విమోచనం: అమిత్​ షా
  • గత పాలకులు విమోచన వేడుకలను ఎందుకు జరపలే? 
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడారు
  • అమరుల త్యాగాలను అవమానించారు
  • భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి కోసమే మోదీప్రభుత్వం విమోచన వేడుకలు నిర్వహిస్తున్నది
  • అమరుల త్యాగాలు మరువలేనివి.. వారికి శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు వెల్లడి
  • పరేడ్‌ గ్రౌండ్​లో ఘనంగా విమోచన దినోత్సవం
  • షోయబుల్లాఖాన్, రాంజీ గోండు స్మారక స్పెషల్ పోస్టల్ కవర్‌ ఆవిష్కరణ 

హైదరాబాద్​, వెలుగు: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మండిపడ్డారు. తెలంగాణ పోరాటయోధుల చరిత్రను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టారని, ఆ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్‌ సంస్థానం 399 రోజులపాటు రజాకార్ల అరాచక పాలనలో మగ్గిందని, నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్​ పటేల్ వల్లే విమోచనం లభించిందని అన్నారు. ‘‘ సర్దార్‌ పటేల్‌ ఆదేశాలతో కేఎం మున్షీ నేతృత్వంలో చేపట్టిన సైనిక చర్యలతో హైదరాబాద్​ స్టేట్​కు విమోచనం కలిగింది. ఆపరేషన్ పోలో ప్రారంభించిన తర్వాత.. రక్తం చుక్క చిందకుండా నిజాం పాలన అంతమైంది” అని తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్​లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్​ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్కడ ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, సర్దార్​ వల్లభాయ్​ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ స్టేట్​ విముక్తి పోరాటంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారని, ఎందరో ప్రాణత్యాగం చేశారని, ఆ పోరాట వీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నవారిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 

Also Rard: లాల్ సలామ్ డబ్బింగ్ కంప్లీట్

సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదని, దేశాన్ని ఐక్యం చేసే నినాదంతోనే పటేల్‌ పోలీసు యాక్షన్‌కు సిద్ధమయ్యారని అమిత్​ షా తెలిపారు. ఆనాడు తెలంగాణ విముక్తి ఉద్యమంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేశాయని, ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని ఆయన అన్నారు. రావి నారాయణరెడ్డి, రామనంద తీర్థ, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నారాయణరావు పవార్‌, కాలోజీ నారాయణరావు, పీవీ నర్సింహారావు వంటి ఎంతో మంది పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేస్తూ వారికి నివాళులు అర్పించారు.  75 ఏండ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదని, ఈ పోరాటానికి సరైన గౌరవాన్ని అందించక పోగా తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని అమిత్​ షా మండిపడ్డారు. తెలంగాణ  భవిష్యత్ తరాలకు స్ఫూర్తినందించే లక్ష్యంతో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే  చరిత్రను సరిచేశారని చెప్పారు. మోదీ ఆదేశాలతో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అమిత్‌షా అన్నారు. 

పరకాలలో మరో జలియన్​వాలా బాగ్​ 

నిజాం పాలనలో పరకాలలో 1,500 మంది జాతీయ జెండాను ఎగరేసినందుకు వారిపై జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్పులు జరిపారని, ఇందులో పలువురు అమరులవగా.. మరికొందరు గాయపడ్డారని అమిత్​ షా గుర్తు చేశారు. ఇదే తరహాలో మహారాష్ట్రలోని పర్భణిలో, కర్నాటకలోని బీదర్ లోనూ సామాన్య జనాలపై కాల్పులు జరిగాయని అన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు 1948  ఆగస్టు 10 నాడు సర్దార్​ వల్లభాయ్  పటేల్ సంకల్పించారని, సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేసి హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కల్పించారని ఆయన చెప్పారు. 

సశస్త్ర సీమాబల్ ఆఫీసర్స్‌ హౌసింగ్‌ ప్రారంభం

సశస్త్ర సీమాబల్ అధికారుల నివాస సముదాయాలను వర్చువల్ గా అమిత్ షా ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ  స్వాతంత్ర్యోద్యమ వెలుగు దివిటీలు షోయబుల్లాఖాన్, రాంజీ గోండు స్మారక స్పెషల్ పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. 

సమైక్యత ఎట్లయితది: కిషన్​రెడ్డి

తెలంగాణ పోరాటాన్ని, స్ఫూర్తివంతమైన చరిత్రను పాతిపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని, ఇది దగా మోసం, కుట్ర, దీన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా చరిత్రను ప్రజల స్మృతిపథం నుంచి చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోలేకపోవడం కారణంగానే.. సర్దార్ పటేల్ మిలిటరీ యాక్షన్ కు ఆదేశించారు. 

 

ఎంతో మంది ప్రజల త్యాగం, అలుపెరగని పోరాటం కారణంగా సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర్యం.. విమోచనమే అవుతుంది తప్ప  సమైక్యత ఎట్ల అవుతుంది?” అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా ప్రజలకు  వాస్తవ చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ బల్లా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, సీఆర్పీఎఫ్, సశస్త్ర సీమాబల్ డీజీలు, సమరయోధుల కుటుంబాలు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కళారూపాలు

నాటి నిజాం సంస్థానంలోని ప్రస్తుత తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా పరేడ్​ గ్రౌండ్​లో కళారూపాలను ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల కళాకారులు తమ కళలతో ఆకట్టుకున్నారు. డప్పు, డోలు వాయిద్యాలు, బతుకమ్మ సంబురాలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇదే రోజు మోదీ పుట్టినరోజు

సెప్టెంబర్​ 17నే ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజని, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అమిత్​ షా అన్నారు.  ‘‘ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా మోదీ కృషిచేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే.. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరింది. జీ20 సమావేశాల ద్వారా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి మరోసారి తెలియజేశాం. జీ 20లో ఆఫ్రికన్​ యూనియన్​కు స్థానం కల్పించి ఢిల్లీ డిక్లరేషన్​తో భారత కీర్తిని ప్రపంచానికి చాటారు.  భారతదేశం సాధిస్తున్న ప్రగతిని నేడు ప్రపంచమంతా ప్రశంసిస్తున్నది. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నది” అని అమిత్​షా చెప్పారు.