కేంద్రంపై మంత్రి ఫైర్... ఆ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న గంగుల

కేంద్రంపై  మంత్రి  ఫైర్... ఆ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న గంగుల

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల రాష్ట్ర రైతాంగానికి కావాల్సిన సదుపాయాలు కల్పించారన్నారు. కరీంనగర్ రూరల్‌లో పర్యటించిన మంత్రి గంగుల దుర్శేడు, నగునూరు, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంతకాలం సరిపడా నీళ్లు ఉన్నా .. కరెంట్ లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పెట్టుబడి లేక కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు భూములు బీళ్లుగా ఉండేవన్నారు. కాళేశ్వరం జలాలు తీసుకురావడంతో పాటు రైతుబంధు, ఉచిత విద్యుత్ వల్ల గణనీయంగా పంట పండుతోందని తెలిపారు.

పండించిన పంటను కొన్నప్పుడే రైతన్న సంతోషంగా ఉంటాడన్నారు. అందుకే సకాలంలో పంట కొనాలని కేంద్రంపై  ఒత్తిడి తెచ్చామన్నారు  గంగుల.  ఇంతకంటే ఎక్కువ కొనలేమని కేంద్రం పరిమితి పెట్టినప్పటికీ సీఎం  కేసీఆర్ మాత్రం ప్రతి గింజా కొంటామని చెప్పారన్నారు మంత్రి. ఇప్పటికే అనేక చోట్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అవసరమైన ప్రతిచోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కొనుగోలు చేసిన పంటకు మూడు నాలుగు రోజుల్లోనే డబ్బులు కూడా ఇవ్వాలని ఆదేశించామన్నారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో 6545 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. 1762 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గడిచిన వారం రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు.

మరో నెల, 45 రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేస్తామన్నారు. గన్నీ సంచుల కొరత లేదన్నారు. రైసు మిల్లుల్లో ఇప్పటికే ధాన్యం నిండుగా ఉండటం వల్ల.. ఒకేరోజు పెద్ద ఎత్తున కొనడం సాధ్యం కాదన్నారు. నల్గొండ, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు మంత్రి. అందుకే రైతులకు టోకెన్లు జారీ చేసామన్నారు. టోకెన్ల ప్రకారమే కొనుగోళ్లకు రైతులు ధాన్యం తీసుకురావాలన్నారు. రైతులంతా ఒకేసారి రాకుండా.. సహకరించాలని తెలిపారు. ఎంత పంట వచ్చినా కొనుగోళ్లు చేస్తామన్నారు. వేలాది ట్రాక్టర్లు వస్తే ఇబ్బందులు వస్తాయనే టోకెన్ల ప్రకారం పంటను కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యామన్నారు. కరీంనగర్ జిల్లాలో గతంలో  3.4 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనేవాళ్లమని మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేశారు.

ఈ సారి సీడ్ వరి కూడా ఉండటం వల్ల 4.5లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. అన్నింటా కేంద్రం లాభాలు ఆశించడం సరికాదన్నారు మంత్రి. ఇది వ్యవసాయ దేశం కాబట్టి రైతు పండించిన ప్రతి పంటను కొనాలని మేము ఒత్తిడి తెచ్చామన్నారు. బాయిల్డ్ రైస్ తీసుకోవద్దని మళ్లీ కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు మంత్రి గంగుల. ఎమ్మెస్పీ, కొనుగోళ్లు, ధాన్యం నిల్వ చేయడం వంటి బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అన్నారు. రైతులు పంటలు పండించేందుకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడం వరకే రాష్ట్రాల బాధ్యతన్నారు. రైతులు ఏ పంట పండించినా.. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోళ్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

యాసంగిలో కూడా కేంద్రం ధాన్యం కొనాలన్నారు. బండిసంజయ్, కిషన్ రెడ్డి మా వెంట వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. యాసంగిలో మేము బాయిల్డ్ రైసు కొనమని కేంద్రం చెబుతోందని... అలా చేప్పడం సరికాదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఆ ఆదేశాలు  కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని గంగుల డిమాండ్ చేశారు.మరోవైపు రైతులు కూడా మంత్రికి పలు విన్నపాలు చేశారు. ఏసంగిలో ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలో అవగాహన కల్పించాలని మంత్రిని  పలువురు రైతులు కోరారు.