హుజురాబాద్‌కు వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగాలె

హుజురాబాద్‌కు వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగాలె

హుజురాబాద్ టీఆర్ఎస్ గడ్డ అని, ఈటల రాక ముందే ఈ గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ఇప్పుడు కూడా ఎగురుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్‌కు వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగాలని బీజేపీకి సవాలు చేశారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో వైస్ ఎంపీపీ లత సహా పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప చేసిందేమీ లేదని మంద్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ అమ్మకానికి, టీఆర్‌‌ఎస్ నమ్మకానికి మారుపేరని ఆయన అన్నారు. బీజేపీ వచ్చాక అచ్చేదిన్‌ రాలేదని, సచ్చేదిన్ వచ్చాయని ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెడతామంటోందని, సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోందని హరీశ్ ఆరోపించారు. ఈటలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగిలో ఎన్ని వడ్లు పండినా కొంటామని కేంద్రాన్ని ఒప్పించాలని అన్నారు. ఈటల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడని, ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రజల కోసం రాజీనామా చేశాడని, ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. ప్రజలు బాగుపడలా.. ఈటల బాగుపడలా ఆలోచించి ఓట్లేయాలని ఆయన సూచించారు. హుజురాబాద్‌కు మీరు కూడా వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగాలని బీజేపీ నేతలకు సవాలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ టీఆర్‌‌ఎస్, బీజేపీ మధ్యనే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్‌ కూడా రాదని అన్నారు.