కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాలను ఎందుకు దాస్తున్నరు? ఇంజినీర్లపై మంత్రుల ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాలను ఎందుకు దాస్తున్నరు?  ఇంజినీర్లపై మంత్రుల ఆగ్రహం

భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇంజనీర్లు ప్రయత్నించడంపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా నేషనల్ డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక గురించి ఈఎన్సీ మురళీధర్ రావు ప్రస్తావించకపోవడాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుబట్టారు. వాస్తవాలను ఎందుకు దాచి పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎంబీ రికార్డుల్లో నమోదు చేయకుండానే బిల్లులు చెల్లించడం, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుతాయని తెలిసీ ఏజెన్సీకి బిల్లులు చెల్లించడమేంటని నిలదీశారు. కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిన తర్వాత చేసిన రిపేర్ల బిల్లులు ఏజెన్సీ పెట్టుకుంటుందని గత సర్కారు ప్రకటిస్తే.. దానికి సంబంధించిన బిల్స్ ఫైల్ ఒకటి ఆర్థిక శాఖలో పెండింగ్‌‌‌‌లో ఉండడం ఏమిటని ప్రశ్నించారు.

ఈ నష్టాన్ని భరించాల్సింది ఎవరు?

కేవలం రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును వదిలేసి.. 18 లక్షల ఎకరాల ఆయకట్టు పేరిట లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు ఎలా ఒప్పుకున్నారని ఇంజనీర్లను మంత్రులు నిలదీశారు. ఒక ఈఎన్సీగా ఉండి కూడా కేసీఆర్ సర్కారు చేస్తున్న అవకతవకలకు అడ్డుచెప్పకుండా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తే అధికారులు, ఇంజనీర్లు ఏం చేశారు? ప్రభుత్వం తప్పులు చేస్తుంటే చెప్పాల్సిన బాధ్యత అధికారులదే. వరద పెరిగి మొత్తం బ్యారేజీ కొట్టుకుపోతే లాస్​ఎవరు భరించాలె?’’ అంటూ మురళీధర్‌‌‌‌‌‌‌‌పై ఫైర్ అయ్యారు. భూకంపాలు తట్టుకునేలా నిర్మించే బ్యారేజీలు 5 ఏండ్లకే కుంగిపోవడం ఏమిటని పొన్నం ప్రశ్నించారు.