- స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: ఎల్బీ స్టేడియంలో శుక్ర, శనివారాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు జరుగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం నిర్వహించనున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభంకానున్న ఫస్ట్ ఎడిషన్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ –2026 ఏర్పాట్లను శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడల పట్ల అవగాహన పెంచేందుకు శాసనసభ్యుల క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగే ఈ క్రీడా పోటీల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని కోరారు. టగ్ ఆఫ్ వార్, ఫుట్బాల్, క్రికెట్, అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తోపాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలను చూసేందుకు ఉచిత ప్రవేశం కల్పించామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.
