కుక్కకాటు నియంత్రణపై మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు

కుక్కకాటు నియంత్రణపై మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు

అంబర్ పేట కుక్క కాటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 పాయింట్స్‭తో.. మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కుక్కలకు స్టెరాలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. నగరవ్యాప్తంగా కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. కుక్క కాటు ఘటనలను నియంత్రించాలని చెప్పింది. GHMC హెల్ప్ లైన్ నెంబర్లు 040-- 21111111 కు కాల్ చేసి నగరవాసులు కుక్కల సమాచారం గురించి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. మాంసం విక్రయ దుకాణాలు, హోటల్స్ నుంచి వేసే వ్యర్థాలను రోడ్ల పై వేయవద్దని సూచించింది. 

కుక్కల స్వభావంపై  స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే..  నగరంలోని అన్ని పాఠశాలల్లో వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం తెలిపింది. కాలనీ సంఘాలు, బస్తీల్లో వీధి కుక్కలతో జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని పేర్కొంది. శానిటేషన్ సిబ్బంది అయా ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇక మూసీ పరివాహక, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే కుక్కలకు సైతం ఆపరేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని.. కుక్క కాటు బాధితులకు వెంటనే వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరిగా.. వీధి కుక్కల కోసం జనాలకు దూరంగా నీటి కుండీలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం సూచించింది.